ఏపీలో బలపడేందుకు వలసలపైనే ఎక్కువగా ఆధారడపడ్డ బీజేపీ ఇందుకోసం టీడీపీని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులకు కాషాయ కండువా కప్పిన బీజేపీ... జిల్లా స్థాయిలో బలమైన నాయకులను సైతం పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందుకోసం పలువురు నేతలతో బీజేపీ చర్చలు కూడా జరుపుతుతోంది.

 

ఈ క్రమంలోనే బీజేపీలోనే చేరేందుకు ఆసక్తి చూపించిన టీడీపీ నేత, సినీ నిర్మాత అంబికా కృష్ణ... ఢిల్లీలో బీజేపీ ముఖ్యనేత రాంమాధవ్ సమక్షంలో బీజేపీలో చేరిపోయారు. అయితే మిగతా నాయకులు బీజేపీలోకి వెళ్లడాన్ని, అంబికా కృష్ణ బీజేపీలోకి వెళ్లడాన్ని టీడీపీ నేతలు వేర్వేరుగా చూస్తున్నారు.

 

చంద్రబాబు వియ్యంకుడు, సినీనటుడు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అంబికా కృష్ణ. దీంతో అంబికా కృష్ణ పార్టీని వీడకుండా చూసేలా బాలకృష్ణ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదా ? అనే చర్చ జరుగుతోంది. ఈయనకు ఈ పదవి రావడానికి కారణం కూడా బాలయ్యే అని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. దీనికితోడు తాను పార్టీ మారే విషయాన్ని బాలకృష్ణకు చెప్పానని అంబికా కృష్ణ చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది.

 

ఏరికోరి అంబికా కృష్ణకు పదవి ఇప్పించుకున్న బాలయ్య... ఆయన పార్టీ మారకుండా ఆపలేకపోయారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి వాళ్లే బీజేపీలో చేరగా లేనిది బాలయ్య సన్నిహితుడు అంబికా కృష్ణ పార్టీ మారడంలో వింతేమీ లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తమ సన్నిహితులు పార్టీ మారకుండా అడ్డుకోవడంలో చంద్రబాబుతో కూడా బాలయ్య కూడా ఫెయిలయ్యారనే టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: