మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారా? ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి.. దాన్ని కాంగ్రెస్ విలీనం చేసిన ఆయన తర్వాత రాజకీయాల్లో ఇమడలేకపోయారు. దీంతో పాలిటిక్స్‌కు దూరమైన ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన సైరా షూటింగ్ ఇటీవలే పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

 

ఇలాంటి తరుణంలో ఆయన రాజకీయాల పట్ల ఆసక్తి కనబరుస్తారని భావించలేం. కానీ ఆయన్ను మళ్లీ రాజకీయాల్లోకి తీసుకు రావాలనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయట. ఏపీలో బలపడేందుకు ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్న బీజేపీ.. ఇప్పటికే టీడీపీ నుంచి నేతలకు గాలమేస్తోంది. వచ్చే ఎన్నికల్లోగా ఎలాగైనా ఆంధ్రాలో బలమైన శక్తిగా ఎదుగుతామని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

 

పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా.. చిరంజీవిని తమ పార్టీలో చేర్చుకోవాలని కమలనాథులు భావిస్తున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. చిరు తమ పార్టీలో చేరితే.. ఆయన్ను ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం. రాంమాధవ్, కన్నా లక్ష్మీ నారాయణ సహా కొందరు బీజేపీ నేతలు చిరంజీవితో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

 

కానీ రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోక ముందే.. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికే సిద్ధపడని చిరంజీవి ఇప్పుడు రాజకీయాల్లో చేరతారనేది అనుమానమే. అదీగాకుండా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న తరుణంలో చిరంజీవికి బీజేపీ నేతలు ఆహ్వానం పంపుతున్నారనే వార్తలు వస్తుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: