ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కీల‌క నిర్ణయం తీసుకున్నారు. త‌న‌దైన శైలిలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా నిర్ణ‌యం తీసుకుంటున్న జ‌గ‌న్ ఈ ద‌ఫా జ‌గ‌న్‌కు పెద్దపీట వేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ (సీపీఆర్‌ఓ)గా పూడి శ్రీహరిని నియ‌మించారు.  గడచిన 2 సంవత్సరాలుగా వై.యస్‌.జగన్‌ మీడియా వ్యవహారాలు చూస్తున్నారు. 14 నెలలు పాటు 3648 కిలోమీటర్లు సాగిన వై.యస్‌.జగన్‌ సుదీర్ఘ పాదయాత్రలో తొలిరోజు నుంచి చివరి రోజువరకూ కొనసాగారు. ఈ మేర‌కు జ‌గ‌న్ తాజాగా కొత్త బాధ్య‌త‌లు క‌ల్పించారు.

 

 

ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా విభాగాల్లో  శ్రీహరికి విశేషం అనుభవం ఉంది. విశాఖపట్నంలో పాత్రికేయుడిగా తన వృత్తిని ప్రారంభించిన శ్రీహరి, గడచిన 19 ఏళ్లుగా జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. పదేళ్లుగా సాక్షిటీవీలో వివిధ హోదాల్లో పనిచేశారు. చీఫ్‌ న్యూస్‌ కో–ఆర్డినేటర్‌గా, ఇన్‌పుట్‌ ఎడిటర్‌గా çపలుకీలక బాధ్యతలు నిర్వహించారు. యాంకర్‌గా అనేక చర్చా కార్యక్రమాలను నిర్వహించారు. అంతకుముందు ఆయన ఈనాడు, ఈటీవీ సంస్థల్లో పనిచేశారు. సాక్షిటీవీ, ఈటీవీ –2 వార్తా ఛానళ్ల ప్రారంభంలో కీలకంగా వ్యవహరించారు. క్షేత్రస్థాయి సమాచార సేకరణ, విశ్లేషణలో శ్రీహరికి విశేష అనుభవం ఉంది. 

 

విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం మామిడిపల్లిలో పూడి శ్రీహరి జన్మించారు. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీహరి ఉన్నత పాఠశాల నుంచి డిగ్రీ వరకూ విశాఖపట్నంలోనే చదువుకున్నారు. డిగ్రీ చివరి సంవత్సరంలోనే విశాఖ జిల్లా రూరల్‌ రిపోర్టర్‌గా తన కెరీర్‌ ప్రారంభించారు. లా సెట్‌లో రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంకు సంపాదించి ఆంధ్రా యూనివర్శిటీలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ న్యాయకళాశాలలో సీటు సంపాదించి, రెండు సెమిస్టర్లు పూర్తిచేసినప్పటికీ, ఈనాడు జర్నలిజం స్కూలుకు ఎంపికకావడంతో జర్నలిజంవైపే మొగ్గు చూపారు.కోర్సు పూర్తిచేసుకున్న తర్వాత ఈనాడు దినపత్రిక, ఈటీవీ–2 ఛానల్‌లో పనిచేశారు. మొదట డెస్క్‌ జర్నలిస్టుగా తర్వాత కో–ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. అత్యుత్తమ సాంకేతిక విలువలతో వచ్చిన సాక్షి ఛానల్‌లో శ్రీహరికి అవకాశం వచ్చింది. వార్తాంశాల్లోనే కాక సాక్షి ఛానల్‌తరఫున నిర్వహించిన అనేక సామాజిక కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. లైఫ్‌లైన్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారిని  సాక్షి ఛానల్‌ ఆదుకుంది. వారికి వైద్యం అందించి నయం అయ్యేంత వరకూ ఆ బాధ్యతను ఛానల్‌తరఫున శ్రీహరి స్వీకరించారు. తర్వాత పేద పిల్లలు కోసం చేపట్టిన బంగారు తల్లి కార్యక్రమం సమన్వయ బాధ్యతలను కూడా ఆయన స్వీకరించారు. చీఫ్‌ న్యూస్‌ కో–ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహించిన శ్రీహరి తర్వాత సాక్షి ఛానల్‌కు ఇన్‌పుట్‌ ఎడిటర్‌ అయ్యారు. నాలుగు సార్వత్రిక ఎన్నికల కవరేజీ, వ్యవహారాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు.దీంతో సీఎం జ‌గ‌న్ ఆయ‌న‌కు సీపీఆర్ఓ బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: