హైదరాబాద్‌: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఎన్నికల నిర్వహణకు ముందస్తు ప్రక్రియను తక్షణం చేపట్టాలని మంగళవారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వార్డుల పునర్విభజన, పునర్విభజన నోటిఫికేషన్‌, వార్డుల వారీగా ఓటర్ల జాబితా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు, వార్డుల వారీగా రిజర్వేషన్‌లు, ఛైర్మన్‌, మేయర్‌ పోస్టుల రిజర్వేషన్‌లను 119 రోజుల్లో పూర్తి చేయాలని పేర్కొంది.

 

అనంతరం 30 రోజుల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు జులై 2తో ముగుస్తున్నందున ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం, బీసీ సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశాయి. వీటిపై మంగళవారం జస్టిస్‌ నవీన్‌రావు విచారణ చేపట్టారు.

 

ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ అసెంబ్లీ రద్దు తర్వాత వాటి ఎన్నికలు, అనంతరం పార్లమెంట్‌, ఎంపీపీ, జడ్పీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం హడావిడిగా ఉందన్నారు. మున్సిపల్‌ చట్టానికి ప్రభుత్వం సవరణలు తీసుకువచ్చిందని, కొత్తగా 68 మున్సిపాలిటీలను ఏర్పాటు చేశామని, 173 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడంతో పాటు మరో 131 పంచాయతీలను పక్కనే ఉన్న 42 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో విలీనం చేసినట్లు చెప్పారు.

 

ఎన్నికలకు ముందు వార్డుల విభజన తదితర ప్రక్రియలు పూర్తి చేయాలంటే 141 రోజులు పడుతుందన్నారు. అయితే ఓటర్ల జాబితాను 28 రోజుల్లో పూర్తి చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ చెప్పారన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ వాటిని మినహాయిస్తే 109 రోజులు ఉంటుందని, అదనంగా 10 రోజులు మొత్తం 119 రోజుల్లో ఎన్నికలకు ముందస్తు ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: