హైదరాబాద్‌: గతేడు ఆరంభమైన పోలీసు నియామక ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో అధికారులు మరో దఫా 15 వేల ఉద్యోగాల భర్తీకి సమాయత్తమవుతున్నారు. ఇందుకు ఇది వరకే ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన నేపథ్యంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

 

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల భర్తీకి పెద్దపీట వేసింది. 2015లో పదివేల ఉద్యోగాలు భర్తీ చేయగా..2018 మే నెలలో 18 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దానికి సంబంధించి కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలకు తుది పరీక్ష పూర్తయింది. అర్హులైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా ముగిసింది.

 

కటాఫ్‌ మార్కుల్ని ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉండగా..వారం రోజుల్లో అది కూడా పూర్తవుతుందని భావిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు జులై నుంచి శిక్షణ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. దాంతో సంబంధిత ఉద్యోగ ప్రకటనకు సంబంధించి రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలిచేపట్టిన భర్తీప్రక్రియ పూర్తయినట్లవుతుంది.

 

మరో దఫా 15 వేల పోలీసు ఉద్యోగాలు మంజూరు చేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైన వెంటనే నియామక ప్రక్రియను ఆరంభించేందుకు పోలీసు నియామక మండలి అధికారులు సిద్ధమవుతున్నారు. తదుపరి నియామకాలు కొత్త జిల్లాల ప్రాతిపదికన జరుగుతాయని ప్రభుత్వం ఇదివరకే పేర్కొన్న నేపథ్యంలో ఈ మేరకు ఖాళీల జాబితా సిద్ధం చేసే కసరత్తును ముమ్మరం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: