రాష్ట్రంలోని పంచాయతీల్లో త్వరలో దాదాపు 17 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విధుల్లో ఉన్నవారికి, కొత్తగా చేరేవారికి నెలకు రూ.8,500 చొప్పున వేతనం అందనుంది. కొత్తవారి ఎంపిక విధివిధానాలపై పంచాయతీరాజ్‌ శాఖ నుంచి వెళ్లిన దస్త్రం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

 

రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి పంచాయతీకి ఒక్కో కార్యదర్శిని ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు వాటి అవసరాలకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులనూ నియమించే యోచనలో ఉంది. కొత్త నియామకాలపై ప్రభుత్వం గత ఏడాదే ప్రకటించినప్పటికీ.. వరస ఎన్నికల కారణంగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఏర్పడింది.

 

ఇప్పుడు ఎన్నికలన్నీ పూర్తికావటంతో.. పంచాయతీరాజ్‌ శాఖ నుంచి వెళ్లిన దస్త్రం ముందుకు కదులుతున్నట్లు తెలిసింది. పంచాయతీరాజ్‌ శాఖ అంచనా ప్రకారం.. ప్రస్తుతం పని చేస్తున్న వారు కాకుండా ప్రతి 500 జనాభాకు ఒకరు చొప్పున లెక్కిస్తే దాదాపు 17 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు అదనంగా అవసరం. ప్రస్తుత కార్మికులకు వేతనాలు నామమాత్రంగా ఉన్నాయి.

 

వేతనాలను పెంచాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించటంతో.. దీనికి అనుగుణంగా నెలకు రూ.8,500 చొప్పున ఇచ్చేలా పంచాయతీరాజ్‌ శాఖ ప్రతిపాదించింది. వేతనం పెంచుతున్నందున వీరి పేరును ‘బహుళ ప్రయోజన పనివారిగా’ మార్పు చేసి.. గ్రామాల్లో పన్నుల వసూళ్లు తదితర పనులకూ ఉపయోగించుకోవాలనే ప్రతిపాదనలూ ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: