కాంగ్రెస్‌ నేత, దివంగత ప్రధాని ఇందిర తరహాలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిపాలిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. ‘అధికార దాహంతో ఇందిర నాడు అత్యవసర పరిస్థితి విధించగా, ప్రస్తుతం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. పత్రికా స్వేచ్ఛలేదు.. ప్రతిపక్షాల నిరసనకు అవకాశం లేదు.. సమ్మెలు చేసినా, ప్రజాస్వామ్యాయుతంగా ఇతరులు గెలిచినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అసహనం పెరుగుతోంది.

 

కార్యకర్తలను కాపాడుకునేందుకు రాజకీయ పార్టీలు పోరాటాలు చేయాల్సి వస్తోంది’ అని ఆరోపించారు. దేశాన్ని తన కుటుంబమే పాలించాలన్న ఉద్దేశంతో ఆనాడు ఇందిర కుట్రలు పన్నగా, ఇప్పుడు రాష్ట్రాన్ని తాను, తన కుటుంబమే పాలించాలన్న లక్ష్యంతో కేసీఆర్‌ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం లాగానే మరో స్వాతంత్య్రపోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు.

 

ఆనాడు జైలుకెళ్లిన పలువురిని బీజేపీ సన్మానించింది. ఇందిర అధికార దాహం, జనాభా నియంత్రణ పేరిట ఆమె తనయుడు సంజయ్‌గాంధీ చేసిన దాష్టీకాలను ఎవరూ మరచిపోలేరని లక్ష్మణ్‌ చెప్పారు. అలాంటి కాంగ్రెస్‌ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడ్డం విడ్డూరమని విమర్శించారు. మీసా చట్టం కింద 6వేల మందిని జైలుకు పంపగా, వారిలో 4వేల మంది ఆరెస్సెస్‌, జనసంఘ్‌ కార్యకర్తలే ఉన్నారన్నారు.

 

ఎమర్జెన్సీలో జైలుకెళ్లిన తాము, ఇందిర ఉన్నంతవరకు బయటకు రాలేమని అప్పట్లో అనుకున్నామని దత్తాత్రేయ అన్నారు. 1977 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఉత్తరాదిన తుడిచిపెట్టుకుపోయిందని, ఇందిరే ఓడిపోవడం మామూలు విషయం కాదన్నారు. ఎమర్జెన్సీ అనేది కాంగ్రెస్‌ శాశ్వత బ్యాడ్జి అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పి.మురళీధర్‌రావు ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: