విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలను అనుమతించబోమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. బాక్సైట్‌ తవ్వకాలకన్నా గిరిజనుల శాంతి, సంతోషాలే తమ ప్రభుత్వానికి ముఖ్యమని కుండబద్దలు కొట్టారు. శాంతిభద్రతలపై కలెక్టర్లు – ఎస్పీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులతో మంగళవారం ప్రజావేదికలో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రకటించారు.

 

విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని, జీవనోపాధి లేకపోవడాన్ని అనుకూలంగా మార్చుకుని వామపక్ష తీవ్రవాద విస్తరణకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. బాక్సైట్‌ తవ్వకాలు జరపాలని ప్రభుత్వం భావిస్తే ముందుగా ఆ ప్రాంత గిరిజనులకు ఉపాధి కల్పించిన తరువాతనే జరగాలని చెప్పారు.

 

మారుమూల గిరిజన, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వ అధికారులు భయంతో వెళ్లడం లేదని పోలీసు ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. ప్రభుత్వం తమ కోసం పని చేస్తుందనే నమ్మకం గిరిజనుల్లో కలిగించాలని చెప్పారు.

 

ఎట్టి పరిస్థితుల్లో బాక్సైట్‌ తవ్వకాలు జరపబోమని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. 2009 ఎన్నికల ముందు బాక్సైట్‌ వ్యతిరేక పోరాటం చేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబునాయుడు 2014లో అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి మరీ బాక్సైట్‌ తవ్వకాలకు జీవో జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ చింతపల్లిలో వైఎస్‌ జగన్‌ గిరిజనులను ఉద్దేశించి మాట్లాడుతూ బాక్సైట్‌ తవ్వకాలను ఎలాంటి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: