ఏపీ, తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి నెల రోజులు కూడా కాక‌ముందే అప్పుడు జంపింగ్‌ల జోరు మామూలుగా లేదు. ఇప్ప‌టికే ఏపీలో టీడీపీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు ఏకంగా బీజేపీలోకి వెళ్లిపోయారు. బీజేపీ వాళ్లు అయితే తాము టీడీపీని ఖాళీ చేయ‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకున్నామ‌ని కూడా చెపుతున్నారు. టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది త‌మ‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్టు వాళ్లు చెపుతున్నారు. 


ఇక తెలంగాణ‌లో కూడా ప‌రిస్థితి ఇలాగే ఉంది. అక్క‌డ గ‌త యేడాది చివ‌ర్లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే అధికార టీఆర్ఎస్ విప‌క్ష పార్టీల‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేల‌ను వ‌రుస‌పెట్టి కారెక్కించేసుకుంటోంది. ప్ర‌జ‌లు కేసీఆర్‌కు ఏకంగా 88 సీట్ల‌తో తిరుగులేని అధికారం క‌ట్ట‌బెట్టినా కూడా అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షాలే ఉండ‌కూడ‌ద‌న్న రీతిలో కేసీఆర్ కాంగ్రెస్‌, టీడీపీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల‌ను త‌మ పార్టీలో చేర్చేసుకుంటున్నారు.


అక్క‌డ లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు మాత్రం టీఆర్ఎస్ ఆశించిన‌ట్టు రాలేదు. ఇక బీజేపీ 4, కాంగ్రెస్ 3 ఎంపీ సీట్లు గెలుచుకుని టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చాయి. కాంగ్రెస్ దేశ‌వ్యాప్తంగా చిత్తుగా ఓడిపోవ‌డంతో తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్లు కూడా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్ల‌లో ఒక‌రు అయిన మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కొద్ది రోజులుగా కాంగ్రెస్ అధిష్టానంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.


ఈ క్ర‌మంలోనే తను పార్టీ మారడం మాత్రం ఖాయమని ప్రకటించారు. బీజేపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లాన‌న్న ఆయ‌న ఆ పార్టీ అగ్ర‌నేత రాంమాధవ్‌తో పాటు కేంద్ర హోం శాఖ స‌హాయ‌మంత్రి కిషన్ రెడ్డి తదితరులతో కూడా టచ్లో ఉన్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టంచేశారు. పార్టీ మార్పు కోసం అవ‌స‌ర‌మైతే తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేస్తాన‌ని చెప్పారు.


ఈ క్ర‌మంలోనే ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్‌కు దేశంలో భ‌విష్య‌త్తు లేద‌న్న ఆయ‌న‌... రాహుల్ గాంధీయే అధ్య‌క్ష ప‌ద‌వి వ‌ద్ద‌నుకుంటున్న‌ప్పుడు ఆ పార్టీకి ఎలాంటి విలువ ఉంటుంద‌ని కూడా రాజ్‌గోపాల్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని కోమటిరెడ్డి తేల్చారు. కోమ‌టిరెడ్డి పార్టీ మారిపోతున్నాన‌ని ఓపెన్‌గానే చెప్పేశారు. మ‌రి దీనిపై టీపీసీసీ ఎలా స్పందిస్తుందో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: