ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ మరో రిలీఫ్ ఇచ్చారు. వచ్చే నెల ఒకటి నుండి 27 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం ప్రకటించిన ముఖ్యమంత్రి తాజాగా..ఉద్యోగుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు సాయంత్రం 5.30 గంటల తరువాత పని చేయాల్సిన అవసరం లేదని ఇప్పటికే సీఎం జగన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. తాజాగా ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా మరో కీలక నిర్ణయానికి సంబంధిచిన అంశం మీద ముఖ్యమంత్రి జగన్ సంతకం చేసారు.


మరో ఏడాది పొడిగింపు..
రాష్ట్ర విభజన తరువాత సచివాలయంతో పాటుగా ప్రధాన కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల కోసం వారానికి అయిదు రోజుల పని దినాలను నిర్ణయించారు.
తొలుత ఇది ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసి చూడాలని..దీని పైన సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరువాత అవసరానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగానే..ఏపీ ప్రభుత్వంలో పని చేస్తూ..హైదరాబాద్‌లోని సచివాలయంతో పాటుగా హెచ్ఓడీల్లో పని చేసే ఉద్యోగుల కోసం నాడు ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఉద్యోగులు రాష్ట్ర విభజన కారణంగా ఉద్యోగుల కుటుంబాలు ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. సమైక్య రాష్ట్రంలో ఏపీలో అయిదు రోజుల పని దినాలను అమలు చేసినా..అప్పట్లో సక్సెస్ కాలేదు. కానీ, రాష్ట్ర విభజన తరువాత ఈ నిర్ణయం ఇప్పటి వరకు అమలు ఆవుతోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నిర్ణయం కొనసాగిస్తారా లేదా అనే సందేహం ఉద్యోగుల్లో వ్యక్తం అవుతోంది. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఉద్యోగులకు వరుసగా వరాలు..
ముఖ్యమంత్రిగా సచివాలయంలోనే బాధ్యతలు స్వీకరించిన నాడే జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిని జూలై నుండి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధఃగా కాంట్రాక్టు..అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు ఇంటి స్థలాల గురించి జగన్ అభయం ఇచ్చారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కావటంతో..ఇప్పుడు జగన్ ఎలా రియాక్ట్ అవుతారనే అనుమానం పలువురు ఉద్యోగులు వ్యక్తం చేసారు.


అయితే, జగన్ మాత్రం ఏపీ సచివాలయం...హెచ్ఓడీల్లో పని చేసే ఉద్యోగులకు అయిదు రోజుల పని దినాలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వుల మీద సంతకాలు చేసారు. ఇదే సమయంలో ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే కీలక అంశం మీద జగన్ మంత్రివర్గ ఉప సంఘంతో సమావేశమై కీలక సూచనలు చేసారు. దీంతో.. ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం అనిపించుకోవటానికి జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: