అక్రమ కట్టడమైన ప్రజావేదికను కూల్చేయాలంటూ సీఎం జగన్ ఆదేశించడంతో రెండు రోజులుగా అధికారులు దాన్ని కూల్చే పనిలో నిమగ్నమయ్యారు. బుధవారం మధ్యాహ్నానికి కూల్చివేత పూర్తవుతున్న సమయంలో ఆ ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది.

 

ప్రజావేదికకు వెళ్లే రహదారి తమ భూములను లాక్కుని వేశారని, దాన్ని కూడా తొలగించాలంటూ ఇద్దరు రైతులు ఆందోళన నిర్వహించారు. చంద్రబాబు తనకు కేటాయించాలని కోరిన ప్రజావేదికను కూల్చడం కక్ష సాధింపేనని టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు.

 

ఇదిలా ఉండగా.. ప్రజావేదిక కంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇల్లే కృష్ణానదికి దగ్గరగా ఉందని, అది కూడా అక్రమ కట్టడమేనని, దాన్ని కూడా కూల్చేయాలని పలువురు మంత్రులు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి లోకేశ్ ఓ ఆంగ్ల మీడియాతో స్పందించారు.

 

తాము ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడం కాదంటూ లోకేశ్ చెప్పినట్లు ఆ ఆంగ్ల మీడియా ప్రచురించింది. అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేస్తామని సీఎం జగన్ ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు ఇంటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: