రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, నెల వ్యవధిలోనే 130 మందికి పైగా టిడిపి కార్యకర్తలపై వైసిపి దాడులు చేసిందని, చివరికి తమ కుటుంబ సభ్యులకు కూడా భద్రత కుదించిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు అన్నారు. నిత్యం పార్టీ కార్యకర్తలపై దాడులు జరగడం చూస్తుంటే శాంతి భద్రతలు లోపించాయనే దానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలన్నారు.

 

యూరప్‌ పర్యటన ముగించుకుని చంద్రబాబు కుటుంబం మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆయనను కలిసి తాజా రాజకీయపరిస్థితులు, ప్రజావేదిక కూల్చివేత నిర్ణయాన్ని ఆయనకు వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ప్రజావేదికను కూల్చడం సరికాదని అభిప్రాయపడినట్లు సమాచారం.

 

ఉండవల్లిలోని ఆయన నివాసంలో రాష్ట్ర టిడిపి కీలకనేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించడంపై నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జడ్‌ప్లస్‌ కేటగిరిలో ఉండే నేతల కుటుంబ సభ్యులకు జడ్‌ క్యాటగిరిలో రక్షణ కల్పిస్తారని, ఇందుకు భిన్నంగా ప్రభుత్వం ఎమ్మెల్సీ లోకేష్‌కు భద్రతను జడ్‌ క్యాటగిరి నుంచి వై కేటగిరికి తగ్గించారని పేర్కొన్నారు.

 

భద్రత తగ్గించడంతో ఐదు ప్లస్‌ ఐదు స్థానంలో రెండు ప్లస్‌ రెండుకు సెక్యూరిటీని తగ్గించారని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణిలకు పూర్తిగా సెక్యూరిటీ తొలగించారని, ఇదెక్కడి న్యాయమని టిడిపి నేతలు ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: