దేశంలోనే ఆనే సీనియ‌ర్ అని, త‌న‌కంటే అనుభ‌వ‌జ్ఞులు ఎవ‌రున్నార‌నే టీడీపీ అధినేత‌, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును అదే మాట‌ల ఆధారంగా ఇర‌కాటంలో ప‌డేశారు ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడమేనని ప్ర‌క‌టించిన‌ సీఎం జగన్‌మోహ‌న్‌రెడ్డి ఈ మేర‌కు ప్రజావేదిక కూల్చివేత‌కు ఓకే చెప్పేశారు. అయితే, ఈ కూల్చివేత వ్యవహారంపై ప‌ర‌స్ప‌రం విమ‌ర్శలు ఎదుర‌వుతున్నాయి.  ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతుండగా...వైసీపీ నేత‌లు స‌మ‌ర్థిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ సీఎం చంద్ర‌బాబుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 


కక్షలతో ప్రజావేదిక కూల్చడంలేదని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ ప్రకటించారు. ప్రజావేదిక కూల్చే ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసిన బొత్స చట్టం తనపని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇంటి వ్యవహారం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. చంద్రబాబు కుటుంబానికి భద్రత కుదింపుపై సమాధానమిస్తూ... నిబంధనల ప్రకారమే చంద్రబాబు కుటుంబానికి భద్రత కుదించామని బొత్స సత్యనారాయణ తెలిపారు.  ప్ర‌తి అంశాన్ని వివాదం చేయాల‌ని టీడీపీ నేత‌లు భావిస్తే...తామేం చేయగ‌ల‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 


మ‌రోవైపు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓవైపు ప్రజావేదిక కూల్చివేత పనులు వేగంగా కొనసాగుతుండగా... ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్‌పై స్పందించారు. చంద్రబాబు నివాసం ఉంటున్న భవనాన్ని ఖాళీ చేస్తే గౌరవంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక, అక్రమ కట్టడమని తేలితే చంద్రబాబు ఉంటున్న ఇంటిని కూడా కూల్చేస్తామని స్పష్టం చేశారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: