‘రాజధాని నిర్మాణానికి భూ సమీకరణలో భూములిచ్చేందుకు ఎక్కువ సంఖ్యలో రైతులు విముఖంగా ఉన్న ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల్లో బలవంతంగా భూములు తీసుకోవలసిన అవసరం ఉందా? ఏ అవసరాల కోసం ఆ భూముల్ని తీసుకోవాలనుకుంటున్నారు?’ అనే అంశాలపై ‘రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ’ (సీఆర్‌డీఏ) అధికారులను ముఖ్యమంత్రి  వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించినట్టు సమాచారం.

 

అమరావతి నిర్మాణంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం అధికారులతో ఆయన సమీక్షించారు. సీఆర్‌డీఏ నుంచి కమిషనర్‌ లక్ష్మీనరసింహంతో పాటు మరో ముగ్గురు ఉన్నతాధికారులు మాత్రమే హాజరయ్యారు. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులెవరినీ అనుమతించలేదు. పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

 

ఏపీసీఆర్‌డీఏ చట్టం తెచ్చినప్పటి నుంచి, ఇప్పటి వరకు జరిగిన పురోగతిని అధికారులు  పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా  ముఖ్యమంత్రి జగన్‌కు తెలియజేశారు. భూసమీకరణలో ఎంత భూమి తీసుకున్నారు? ఎంత మంది రైతులు భూములిచ్చారు? వారికి ఎన్ని ప్లాట్లు కేటాయించారు? రాజధానిలో ప్రస్తుతం ఏ పనులు జరుగుతున్నాయి? అనే వాటిమీద సమీక్ష జరిపారు.

 

మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన, రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణ, ఆర్థిక ప్రణాళికేంటి? వంటి వివరాల్ని అధికారులు క్షుణ్నంగా వివరించినట్టు తెలిసింది. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు వంటి గ్రామాల పరిధిలో భూములు రాజధానికి ఏ విధంగా అవసరమో అధికారులు ఈ సందర్భంగా వివరించారు. రెండు వారాల్లో మళ్లీ సమావేశమవుదామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు చెప్పినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: