దేశంలోని ప్రతి ఇంటికీ 2024 నాటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో జల సంక్షోభంపై రాజ్యసభలో బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ ఓ ప్రశ్నకు జవాబిస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. నీటి సంరక్షణకు, భూగర్భ జలాలు తోడెయ్యకుండా కేంద్రం చర్యలు చేపడుతుందన్నారు.

 

దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ప్రజలకు నీళ్లు దొరకడం లేదు. పలుచోట్ల పరిస్థితి దయనీయంగా మారింది. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బిందెడు నీటిని బంగారంలా భావించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీటి కొరతతో చెన్నైలో కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయాలని సూచిస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది.

 

జల సంరక్షణపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శ్రద్ధ కనబరుస్తున్న నేపథ్యంలో  దేశవ్యాప్తంగా జులై 1 నుంచి సెప్టెంబరు 15 వరకు (ఎంపిక చేసిన జిల్లాల్లో నవంబరు వరకు) జేఎస్‌ఏను అమలు చేయనున్నారు. జల సంపద సృష్టి, చైతన్య కార్యక్రమాల ద్వారా ప్రజా ఉద్యమంగా దీన్ని చేపట్టనున్నారు. గ్రామీణ భారతంలో కాల పరిమితితో కూడిన జల సంరక్షణ, సమర్ధ నీటిపారుదల కార్యక్రమాలు చేపడతారు.

 

7 నిర్దేశిత ప్రాంతాల్లో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతం చేస్తారు. ఇందుకు గాను 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆయా జిల్లాల్లో.. పరిస్థితి తీవ్రంగా ఉన్న 313 ప్రాంతాలు సహా 1,593 నీటి ఎద్దడి బ్లాక్‌లను గుర్తించారు. ప్రత్యేకించి వేసవిలోను, వర్షాభావంతోను ఎండిపోయిన వివిధ ప్రాంతాల్లో జల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: