ఔషధ పరిశోధనలకు సంబంధించి అగ్రగామి సంస్థల్లో ఒకటైన హిల్లేమ్యాన్‌ లేబొరేటరీస్‌తో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సాంకేతిక సహకార ఒప్పంద కుదుర్చుకుంది. దీని ప్రకారం ‘హిల్‌కాల్‌’ కలరా వ్యాక్సిన్‌ను భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేస్తుంది. ఆ వ్యాక్సిన్‌ తయారీ, వాణిజ్యీకరణ కార్యకలాపాల్లోనూ భాగస్వామి అవుతుంది.

 

పేద దేశాల్లో కలరా వ్యాధి తీవ్రత ఎంతో ఎక్కువ. ‘వైబ్రియో కలరా’ అనే సూక్ష్మజీవి వల్ల కలరా వ్యాధి సోకుతుంది. ఇది ఎంతో ప్రాణాంతక వ్యాధి. దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా కలరా బాధితులు ఉంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) లెక్కల ప్రకారం ఏటా 95,000 మంది ఈ వ్యాధితో చనిపోతున్నారు. మనదేశంలోనూ కలరా వ్యాధి తీవ్రత అధికంగానే ఉంది. అందుకే నోటి ద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్‌ను డబ్లూహెచ్‌ఓ సిఫార్సు చేస్తోంది.

 

2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా కలరా వ్యాధి తీవ్రతను 90 శాతం మేరకు తగ్గించాలనేది డబ్లూహెచ్‌ఓ లక్ష్యం. ‘హిల్‌కాల్‌’ కలరా వ్యాక్సిన్‌ను స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించారు. తదుపరి దీన్ని హిల్లేమ్యాన్‌ లేబొరేటరీస్‌ అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌ ప్రయోగాలు బంగ్లాదేశ్‌లో నిర్వహించారు. దీని తదుపరి అభివృద్ధి ప్రక్రియను భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ చేపడుతుంది.

 

'హిల్‌కాల్‌' కలరా వ్యాక్సిన్‌ తయారీలో ఈ ఒప్పందం ఎంతో కీలక ముందడుగు అని భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) డాక్టర్‌ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. తమకు 5 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ తయారీ సామర్థ్యం ఉన్నట్లు చెప్పారు. కలరా వ్యాక్సిన్‌కు డబ్లూహెచ్‌ఓ ప్రీ-క్వాలిఫికేషన్‌ సంపాదించాక ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేస్తామని, తద్వారా ఎంతో మందికి దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు అవుతుందని వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: