ప్ర‌ణాళిక లోపం...విచ్చ‌ల‌విడి వాడ‌కం..ప‌ర్యావ‌ర‌ణంపై శ్ర‌ద్ధ లేక‌పోవ‌డం వ‌ల్ల ఎంత‌టి తీవ్ర‌మైన ప‌రిస్థితులు ఎదురవుతాయ‌నేందుకు పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నై ఉదాహ‌ర‌ణ‌. ఆ రాష్ట్రంలో తీవ్ర నీటి కొర‌త ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిస్థితిపై సీపీఎం రాజ్యసభ పక్ష నేత టీకే రంగరాజన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. త‌మ రాష్ట్రంలో బంగారం కంటే తాగునీరే అధిక ధర ఉందనీ ప్ర‌క‌టిస్తూ...ఇది వినేందుకు ఆశ్చర్యంగా అనిపించవచ్చనీ... కానీ వాస్తవమని వెల్లడించారు.


రంగరాజన్ మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల కాలంలో నీటి వసతి లేక చెన్నై సమీపంలోని రెండు షుగర్‌ కంపెనీలు నీరు మూత పడ్డాయని అన్నారు. దేశంలో మొట్టమొదటి సారి వాటర్‌ కమిషన్‌ చెన్నైకి వెళ్ళి నీటి కొరతపై విచారణ జరిపిందని గుర్తు చేశారు. 41 శాతం ప్రజానీకానికి నీటి కొరత ఉన్నట్టు తెలిపారు. చెన్నైలోని అత్యధిక ప్రజానీకం తాగునీరు కోసం ప్రభుత్వ సరఫరపై ఆధారపడి ఉన్నారన్నారు. అందులో చాలావరకు నీరు మున్సిపాలిటీ, ప్రయివేటు నిర్వహకులు అందజేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర రాజధానిలోని పలు ప్రముఖ ఐటీ సంస్థలుే ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని చెబుతున్నాయని చెప్పారు. ఎన్నో హోటళ్ళు, రెస్టారెంట్లు మూత పడిన విషయన్ని గుర్తు చేశారు. ఇదంతా సరైన ప్రణాళిక లేకపోవడంతో జరిగిందని అభిప్రాయపడ్డారు. అయితే, దీనిపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. నీరు సరా ప్లస్‌ ఉన్నటువంటి రాష్ట్రాలతో మాట్లాడి చెన్నైకి నీరు వచ్చే విధంగా చేయాలని కోరారు.


తమిళనాడు రాష్ట్రం నీటి సమస్యను పెద్ద ఎత్తున ఎదుర్కొంటుందని వాపోయారు. డెల్టా ఏరియాలోని ప్రజలు కూడా ఇక్కట్ల పాలవుతున్నట్టు చెప్పారు. చెన్నై కేవలం తమిళనాడు రాజధాని మాత్రమే కాదనీ... ఇదొక కాస్మొపాలిటిన్‌ సిటీ అని అన్నారు. ఈ నగరంలో 47 శాతం ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజానీకం జీవిస్తున్నారని అన్నారు. అందులో ప్రధానంగా ఆంధ్ర, గుజరాత్‌, కేరళ ప్రజానీకం ఉన్నారని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ రాష్ట్రానికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.


ఇదిలాఉండ‌గా, తాగునీటి కొరతతో చెన్నై నగరవాసులు అల్లాడుతున్నా అధికార అన్నాడీఎంకే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని డీఎంకే అధినేత స్టాలిన్‌ మండిపడ్డారు. నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆయన నగరంలోని చెపాక్‌ స్టేడియం వద్ద ఆ పార్టీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ ఏఐఏడీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ 'మాకు నీళ్లియ్యండి' అనే ఒకే ఒక్క మాట అంటున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నీటి సమస్య ఇప్పటికిప్పుడు వచ్చిపడింది కాదనీ, ఎన్నో ఏండ్లుగా జనాలు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పళనిస్వామి సర్కారు మాత్రం ఒక్క తాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నీటి కొరత ఉంటే ఏఐఏడీఎంకే నాయకులు యజ్ఞాలు చేస్తున్నారనీ.. కానీ వారి యజ్ఞాలు నీటి కోసం కాదనీ, అధికారాన్ని కాపాడుకోవడం కోసమని స్టాలిన్‌ ఎద్దేవా చేశారు. ఈ ధర్నాలో వేలాది మంది మహిళలు ఖాళీ బిందెలు పట్టుకుని పళనిస్వామి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ 'బిందెలున్నాయి.. నీళ్లెక్కడ' అంటూ హోరెత్తించారు. కాగా, తమిళనాట తాగునీటి సమస్యపై చర్చించడానికి డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు లోక్‌సభ స్పీకర్‌కు నోటీసులు అందజేశారు. 


ఇదిలాఉంటే చెన్నై నీటి కష్టాలను తీర్చడానికి నగరానికి సమీపాన ఉన్న వేలూరు జిల్లా జోలార్‌పెట్టారు డ్యాం నుంచి రోజులకు పది లక్షల మిలియన్ల నీటిని రైల్వే వ్యాగన్ల ద్వారా సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. దీనిపై డీఎంకే సీనియర్‌ నాయకుడు, కట్పడి ఎమ్మెల్యే దొరై మురుగన్‌ స్పందిస్తూ.. వేలూరు నుంచి నీటిని తరలిస్తే తామంతా నిరసనలకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: