కేసీఆర్‌ కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారు పాలనను భరించలేకనే ప్రజలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఆదరించారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి 20 శాతం ఓట్లు వేసినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

 

తెలంగాణపై బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందన్నారు. 2023లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు. కుల రాజకీయాలు, కుటుంబపాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్నారు. అవినీతి అక్రమాలు పెరిగిపోయాయన్నారు. తాను 15 ఏళ్లు మధ్యప్రదేశ్‌ సీఎంగా పనిచేశానని.. ఒక్క రోజు కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రాభివృద్ధి పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని చెప్పారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లకపోవడమే దీనికి నిదర్శనమన్నారు.

 

విజయగర్వంతో విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అందరినీ కలుపుకొనే లక్ష్యంతో ‘సర్వ స్పర్శ్‌- సర్వ వ్యాప్తి’ లక్ష్యంతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టనున్నట్లు వివరించారు. తెలంగాణలో 3200 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. సుమారు 8వేల మంది పూర్తి స్థాయి పార్టీ కార్యకర్తలు వారంరోజుల పాటు సభ్యత్వ నమోదులో పాల్గొంటారని వివరించారు.

 

‘ఏపీ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఢిల్లీతో పాటు ఉత్తరభారతం, విదేశీ పర్యటనలతో ఎక్కువ కాలం గడిపారు. నాడు వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా పాదయాత్రతో నిత్యం ప్రజలకు దగ్గరగా ఉన్నారు. అందుకే ఆయన ఇప్పుడు సీఎం అయ్యారు. ఆ స్ఫూర్తితోనే తెలంగాణలోనూ పనిచేయాలి’ అని అన్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: