తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయం లో మంత్రుల వద్ద పని చేసిన సిబ్బందికి ఇప్పుడు  కొత్త కష్టం వచ్చి పడింది . గతం లో మంత్రుల వద్ద విధులు నిర్వహించినవారు , తిరిగి నూతన మంత్రుల ప్రాపకం సంపాదించి , యధావిధిగా తాము అదే స్థానాల్లో కొనసాగవచ్చునని భావించారు . అయితే గత ప్రభుత్వ హయం లో మంత్రుల వద్ద పనిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో,  తమ వద్ద విధుల్లోకి తీసుకో వద్దంటూ  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , మంత్రులకు విస్పష్టం చేశారు. 


దీనితో గతం లో మంత్రుల వద్ద పని చేసి,  తిరిగి ప్రస్తుత మంత్రుల వద్ద అదే స్థానం లో కొనసాగాలని ప్రయత్నిస్తున్న వారి ఆశలపై ముఖ్యమంత్రి నిర్ణయం...  నీళ్లు చల్లినట్లయింది . గత ప్రభుత్వ హయం లో మంత్రుల వద్ద ఓఎస్ డి లుగా , ప్రైవేట్ కార్యదర్శులుగా , అదనపు ప్రైవేట్ కార్యదర్శులుగా , వ్యక్తిగత సహాయకులుగా పలువురు పని చేశారు . గతం లో మంత్రుల వద్ద పని చేసిన అనుభవం ఉండడం తో వారిని , కొత్త మంత్రులు తమ వద్ద పని చేసేందుకు నియమించుకునే అవకాశాలున్నాయి .


గత అనుభవం ఉందని వారిని విధుల్లోకి తీసుకుంటే, ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలు ముందుగానే లీక్ అయ్యే ప్రమాదముందని గ్రహించే , జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుని ఉండి ఉంటారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . ప్రభుత్వ కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు టీడీపీ నేతలు వారిని సంప్రదించే అవకాశముందని , గతం లో వారి వద్ద పని చేసిన కారణంగా వారు కూడా కాదనలేక చెప్పే అవకాశం ఉంటుందని భావించే జగన్ ఈ విషయం లో కఠినంగా ఉండాలని మంత్రులకు సూచించి ఉంటారని అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: