గాడి తప్పిన విద్యుత్‌ శాఖను దారిలో పెట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. గడచిన ఐదేళ్లుగా ఈ రంగంలో జరిగిన అవినీతి కార్యకలాపాలపై అధికారులు చెప్పిన వివరాలు విని విస్తుబోయారు. ఇందుకు బాధ్యులైన ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి బుధవారం విద్యుత్‌ రంగంపై ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష జరిపారు.

 

గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ శాఖలో జరిగిన అక్రమాల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. చౌకగా లభించే థర్మల్‌ పవర్‌ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తిదారులకు దోచిపెట్టారని, దీని వల్ల రూ.2,636 కోట్ల మేర విద్యుత్‌ సంస్థలకు నష్టం వాటిల్లిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.

 

తక్కువకే జీఎంఆర్‌ గ్యాస్‌ విద్యుత్‌ లభిస్తున్నా, పీపీఏ గడువు ముగిసిన ల్యాంకో, స్పెక్ట్రం నుంచి అధిక రేటుకు విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్ల రూ.276 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు. ఇన్ని అక్రమాలు జరిగాయని తెలుసుకున్న ముఖ్యమంత్రి అన్నింటిపైనా వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఇన్ని స్కాములకు పాల్పడి ప్రభుత్వం చేసిన పీపీఏలపై పునః సమీక్షించాలని సూచించారు.

 

చౌకగా థర్మల్‌ విద్యుత్‌ అందుబాటులో ఉన్నా ప్రైవేట్‌ పవన, సౌర విద్యుత్‌ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా దోచిపెట్టిందో ఇంధన శాఖ సవివరంగా సీఎం ముందుంచింది. వాస్తవానికి మెరిట్‌ ఆర్డర్‌ ప్రకారం చౌకగా లభించే విద్యుత్‌కు ముందు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఆ శాఖ అధికారులు వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: