వైఎస్‌ఆర్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న మాట నిల‌బెట్టుకునే క్ర‌మంలో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత ఆ దిశ‌గా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలకు హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగుతుంది. తాజాగా బుధ‌వారం జగన్‌ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడంపై సమీక్ష నిర్వహించారు. మాజీ ఐపిఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆర్టీసి విలీన కమిటీకి జగన్‌ ఈ భేటిలో దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం అనంతరం సచివాలయంలో అధ్యయన కమిటీ సభ్యులు విడివిడిగా భేటీ అయ్యారు. 

 

 

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం దిశగా అడుగులు ప‌డుతున్న త‌రుణంలో...తాజాగా ఆర్టీసీ హౌస్‌లో కార్మిక సంఘాలతో ఆర్టీసీ విలీనం కమిటి చెైర్మన్ ఆంజనేయరెడ్డితో సమావేశం జ‌రిగింది.  ఆర్టీసీ విలీనంపై కార్మిక సంఘాల అభిప్రాయాలను కమిటీ స్వీకరిస్తోంది. ఆర్టీసీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి రావు ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం నియమించిన ఆంజనేయ రెడ్డి కమిటీని మొదటిసారి కలవడం జరిగిందని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ముందుకు రావడం సంతోషక‌ర‌మ‌న్నారు. ఈయూ ఎన్నో సంవత్సరాల పోరాటానికి కృషి ఫలితమే ఈ విలీన ప్రక్రియ అని వెల్ల‌డించారు. నష్టాల పేరు మీద ఆర్టీసీ కుదేలు అవుతుందని, సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు కూడా కష్టంగా మారిందపన్నారు. విలీనం వల్ల ఆర్టీసీ మెరుగుపడుతుందని, ఉద్యోగులకు కూడా మేలు జరుగుతుందని తెలిపారు.

 

 

ఇదిలాఉండ‌గా, ఆర్టీసి ఎండీ ఎన్‌వి సురేంద్రబాబుకు స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌కె జిలానీ బాషా, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ సుందరయ్య వివిధ అంశాల‌పై వినతిపత్రం సమర్పించారు. విలీనం తరువాత చేయాల్సిన పది అంశాలను అందులో ప్రస్తావించారు. ఆర్టీసికి ఎంవి ట్యాక్స్‌, డీజిల్‌, స్పేర్‌ పార్ట్‌ల మీద పన్నును మినహాయించాలని, ప్రయివేట్‌ బస్సుల అక్రమ రవాణాను అరికట్టాలని కోరారు. ఆర్టీసి ఆస్తులను ప్రభుత్వ ఈక్విటీగా పరిగణించాలని, ఆర్టీసి అప్పులు, వడ్డీలను వన్‌ టైం సెటిల్‌మెంట్‌ ద్వారా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త బస్సుల కొనుగోలు, పాత బస్సుల స్థానంలో బస్సుల భర్తీ కోసం ఆర్థిక సహకారం అందించాలని, 1950 ఆర్టీఎ చట్టం ప్రకారం 1:2 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూషన్‌ ఇవ్వాలని కోరారు. ఆర్టీసిని లాభాలు-నష్టాలుగా కాకుండా సామాజిక బాధ్యతగా చూడాలని, కార్మికుల కష్టానికి తగినట్లుగా వేతనాలు పెంచాలని, కార్మికుల సర్వీస్‌ కండీషన్లను మెరుగుపర్చాలని విన్నవించారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వమే రవాణా సౌకర్యాన్ని పెంచాలని, విలీనం తరువాత కార్గో, గూడ్స్‌ సర్వీసులను ప్రభుత్వం నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ప్రయోజనాలతో పాటు ప్రస్తుతం ఆర్టీసి కార్మికులకు అందిస్తున్న ప్రయోజనాలన్నీ అందించాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: