టీఆర్ఎస్ పార్టీ ట్ర‌బుల్‌షూట‌ర్‌గా పేరొందిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్‌రావు సుదీర్ఘ‌కాలం త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చారు. అయితే, ఆయ‌న మీడియాతో మాట్లాడ‌లేదు. కానీ ఆస‌క్తిక‌ర రీతిలో వార్త‌ల్లో నిలిచారు. హైదరాబాద్‌లోని తెలంగాణ‌ రాష్ట్ర సెక్రటేరియట్‌లో కొత్త భవనం భూమిపూజ సందర్భంగా హరీష్ రావు- కేటీఆర్ హాజరయ్యారు. వీరిద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అయితే.. ఈ ఇద్దరి మధ్య సంభాషణ చూసేవారిని ఆకట్టుకుంది. బావ – బామ్మర్ది మాట ముచ్చట ఇలా జరిగిందంటూ అక్కడ ఉన్న రిపోర్టర్లు, అధికారులు చర్చించుకున్నారు.


హైదరాబాద్ సెక్రటేరియట్ ప్రాంగణంలో కొత్తభవన నిర్మాణ భూమిపూజ ఇవాళ సంప్రదాయపద్ధతిలో జరిగింది. వేద, మంత్రోచ్ఛారణల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ పూజా కార్యక్రమాలు నిర్వహించి… భూమిలోకి పలుగు దించారు. మట్టి తవ్వారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రమంత్రులు , హరీష్ రావు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , అధికారులు హాజరయ్యారు. కొత్త సచివాలయం భూమిపూజ సందర్భంగా బావ బామ్మర్దులు హరీష్ రావు, కేటీఆర్ మధ్య సరదా సంభాషణ జరిగింది. “బావ…మళ్లీ కుదరదేమో…ఒకసారి మన పాత చాంబర్లు చూసుకుందాం” అంటూ బావ హరీష్ రావుతో బావమరిది కేటీఆర్  అన్నారు. దీనికి సరేనంటూ.. హరీష్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. హరీష్ రావు, కేటీఆర్ లతో అక్కడికి వచ్చిన నాయకులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అడిగినవారికి సెల్ఫీలు ఇస్తూ.. బావ బామ్మర్దులు ఫొటోలు దిగారు.


రాష్ట్రమంత్రులందరూ పూజా కార్యక్రమాలకు ముందుగా ఏర్పాటుచేసిన వేదిక దగ్గర కుర్చీలపై కూర్చున్నారు. కార్యక్రమానికి వచ్చిన కీలక నాయకుడు హరీష్ రావు మంత్రుల వేదికకు దూరంగా నిల్చుకున్నారు. అధికారులను, నాయకులను పలకరించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయనతో పాటు కార్యక్రమానికి వచ్చి కార్య‌క్ర‌మానికి దూరంగా ఉండిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: