ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతీవ్ర వివాదాస్ప‌దంగా మారింది. సౌమ్యుడు, వివాద‌ర‌హితుడు అనే పేరున్న వ్య‌క్తి విష‌యంలో  మోదీ రాజ‌కీయ క‌క్ష‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ విష‌యంలో మోదీ స‌ర్కారు పాల్ప‌డిన చ‌ర్య‌పై ప‌లువురు భ‌గ్గుమంటున్నారు. మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్‌సింగ్‌కు 14 మంది సిబ్బంది ఉండ‌గా, వారిని 5కు కుధించారు. దీంతో ఈ మేర‌కు మ‌న్మోహ‌న్ ఆవేద‌న చెందుతూ లేఖ రాశారు.


మాజీ ప్ర‌దాన‌మంత్రి హోదాలో ఉన్న తనకు కేటాయించిన సహాయ సిబ్బందిని తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కార్యాలయానికి రెండోసారి లేఖ రాశారు. గతంలో తనకు 14 మంది సహాయ సిబ్బంది ఉండేవారని, ఆ సంఖ్యను ఐదుకు తగ్గించడం తగదని ఆ లేఖలో పేర్కొన్నారు. తాను ప్రధానిగా ఉన్నప్పుడు మాజీ ప్రధాని వాజపేయికి తొలి ఐదేళ్లు పూర్తి సహాయ సిబ్బందిని (14 మందిని) కేటాయించానని, తర్వాత ఆయన సూచన మేరకు ఆ సంఖ్యను 12కు తగ్గించానని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే సూత్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం పాటించాలని కోరారు. పూర్తిస్థాయి సహాయ సిబ్బందిని కొనసాగించాలంటూ గతంలో కూడా లేఖ రాశానని, కానీ తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండా సిబ్బందిని తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.


మాజీ ప్రధానులకు 14 మంది సహాయ సిబ్బందిని కేటాయించాలని దివంగత ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి రావడానికి నాలుగు రోజుల ముందు తన సహాయ సిబ్బందిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం సరికాదని, ఇప్పటికైనా పూర్తిస్థాయి సహాయ సిబ్బందిని కేటాయించాలని మన్మోహన్ విజ్ఞప్తి చేశారు. కాగా, కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: