న‌ల్ల‌ధ‌నం విష‌యంలో కీల‌క ప‌రిణామం ఇది. బ్లాక్ మ‌నీ అంటే వెంట‌నే గుర్తుకు వ‌చ్చే స్విట్జ‌ర్లాండ్‌లో ప‌రిస్థితి మారుతోంది. పన్ను ఎగవేతదారులకు స్వర్గధామాలుగా విరాజిల్లుతున్న స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపాదన తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. అక్రమార్కుల పంథా మారిందో.. లేక ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయో.. తెలియదుగానీ స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో మనోళ్ల సొమ్ము మాత్రం గతేడాది రికార్డు స్థాయికి పడిపోయింది. భారతీయులు, భారతీయ సంస్థల నగదు నిల్వలు నిరుడు దాదాపు 6 శాతం దిగజారాయని గురువారం స్విస్ నేషనల్ బ్యాంక్ వెల్లడించిన వివరాలు చెబుతున్నాయి. ఈ ఫ‌లితాల వెనుక ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కృషి ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.


2018లో 954.71 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ (దాదాపు రూ.6,757 కోట్లు)కు పరిమితమయ్యాయి. భారత్ ఆధారిత శాఖల ద్వారా వచ్చిన సొమ్ము కూడా ఉన్నా...స్థూల సంపద క్షీణించడం విశేషం. గడిచిన రెండు దశాబ్దాలకుపైగా కాలంలో ఇది రెండో అత్యంత కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. 1995లో 723 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ ఉన్నట్లు తేలింది. మళ్లీ ఆ తర్వాత ఇదే కనిష్ఠం. 1987లో మాత్రం 675 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్‌గా నమోదైంది. ఇదే ఎప్పటికీ కనిష్ఠంగా ఉంది. నిజానికి 2017లో 50 శాతం పెరిగి రూ.7,000 కోట్లను తాకింది. అంతకుముందు వరుసగా మూడేండ్లు తగ్గుతూనే రాగా, 2017లో మాత్రం పెరుగడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. అయితే మళ్లీ 2018లో తగ్గినట్లు తాజా గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. 


2006లో స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల సంపద రూ.23,000 కోట్లుగా నమోదైంది. ఇదే అత్యంత గరిష్ఠ స్థాయి. ఆ తర్వాతి కాలంలో తగ్గుతూనే వస్తోంది. 2011, 2013ల్లో మాత్రం పెరిగిన సంకేతాలు కనిపించాయి. 2011లో 12 శాతం, 2013లో 43 శాతం ఎగిసింది. మళ్లీ 2017లోనే 50 శాతం పెరిగింది. కాగా, నిరుడు సంపదలో 15 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల మేర వెల్త్ మేనేజర్ల దగ్గరే ఉన్నట్లు తెలుస్తుండగా, బ్యాంకుల ద్వారా 104 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ డిపాజిట్లు జరిగాయి. 2018లో భారతీయుల డిపాజిట్లు 572 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. సెక్యూరిటీస్, ఇతర మార్గాల ద్వారా వచ్చే డిపాజిట్లు తగ్గాయని స్విస్ నేషనల్ బ్యాంక్ ఈ సందర్భంగా తెలిపింది. బ్యాంకింగేతర లేదా భారతీయ వ్యక్తిగత కస్టమర్ల డిపాజిట్లు 84.6 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2017లో 94.8 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక స్విస్ బ్యాంకుల్లోకి అన్ని దేశాల నుంచి వచ్చే సొమ్ము కూడా తగ్గుముఖం పట్టింది. 2018లో 1.4 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్ (సుమారు రూ.99 లక్షల కోట్లు)లుగానే ఉంది.


ఇదిలాఉండ‌గా, నల్లధనంపై పోరును ప్రారంభించిన న‌రేంద్ర‌మోదీ సర్కారు కృషి ఫ‌లితమే ఈ మేర‌కు త‌గ్గుద‌ల అని అంటున్నారు. బ్లాక్‌మ‌నీని అరిక‌ట్ట‌డంలో భాగంగా, స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో సమాచార మార్పిడి ఒప్పందాన్ని చేసుకుంది. ఇది 2018 జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చింది. ఇప్పటికే నల్లధనం కుబేరుల వివరాలను స్విట్జర్లాండ్ ప్రభుత్వం విడుతలవారీగా కేంద్రానికి అప్పజెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది భారతీయుల సంపద స్విస్ బ్యాంకుల్లో మరింతగా తగ్గవచ్చన్న అంచనాలున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: