రచయిత దివాకర్ బాబు గారు చెప్పిన... విజయనిర్మల గారి జ్ఞాపకం...

హైదరాబాద్…. 1993.... ఒక రోజు నేనూ, ఎస్. వి. కృష్ణారెడ్డి గారూ కృష్ణ గారికి "నెంబర్ వన్" సినిమా కథ చెప్పడానికి వెళ్ళాం. కృష్ణ గారూ, శ్రీమతి విజయనిర్మల గారూ సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. టీ తాగాక కథ విందామా అన్నారు కృష్ణ గారు. వెంటనే విజయనిర్మల గారు లోపలికి వెళిపోయారు. మేము కథ చెప్పాము. విశ్రాంతి వరకూ మొదటి సగభాగం చెప్పడం పూర్తయింది. కృష్ణ గారు మాట్లాడిన మొదటి మాట "సూపర్ హిట్." మా శ్రమ ఫలించినందుకు కళ్ళు చెమర్చాయి మాకు. 

అప్పుడు కృష్ణ గారు విజయనిర్మల గారిని పిలిచి "ఇంటర్వెల్ దాకా విన్నాను. సూపర్ హిట్ కథ చెప్పారు" అని చెప్పారు. 

ఆవిడ అభినందనలు చెప్పి స్వయంగా కాఫీ, బిస్కట్స్ తెచ్చి ఇచ్చి వెళిపోయారు. ద్వితీయ భాగం చెప్పడం మొదలు పెట్టాం. 

గంట సమయం పట్టింది. విన్నాక కృష్ణ గారు కాసేపు మౌనంగా వున్నారు. మా గుండెలు గుండెల్లో లేవు. కాసేపటి తర్వాత " ఇంటర్వెల్ దాకా విని నేను చెప్పిన అభిప్రాయం తప్పు" అన్నారు. గుండెలు జారిపోయాయి మాకు. అప్పుడు కృష్ణ గారు నవ్వుతూ "సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ప్రొసీడ్" అని పచ్చజెండా వూపారు. చెమర్చిన కంటి నీరు బుగ్గలపైకి జారింది. వెంటనే కృష్ణ గారు  విజయనిర్మల గారిని పిలిచి చెప్పారు. ఆవిడ అభినందించారు. 

 

ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందంటేతాను దర్శకురాలయి వుండి కూడా కథ వినడం కానీ, వేలు పెట్టడం కానీ చేయలేదు. దర్శకురాలిగా మరో దర్శకుడికి ఆమె ఇచ్చిన గౌరవం. తానొక దర్శక దిగ్గజం అయినా భర్త ప్రొఫెషన్ లో తల దూర్చక పోవడం. ఆ సందర్భం లో కేవలం ఒక గృహిణిగా తన ధర్మాన్నినిర్వర్తించడం. ఎంతో పరిపక్వత వుంటే కానీ అంత హుందాగా వుండడం కష్టం. అలాంటి విజయనిర్మల గారు దూరమవడం కృష్ణ గారికి ఎవరూ తీర్చలేని లోటు !

మరింత సమాచారం తెలుసుకోండి: