తెలుగు రాష్ట్రాలు స్నేహభావంతో మెలుగుతున్నాయి. గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి నడుంబిగించాం. జగన్‌ యువకుడు, ఏపీ అభివృద్ధిపై గొప్ప సంకల్పంతో ఉన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య శుక్ర, శనివారాల్లో వివిధ అంశాలపై కీలక సమావేశాలు నిర్వహించనున్నాం. నదీ జలాల వినియోగంతో పాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలను చర్చిస్తాం. వాటి ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.. అని కే.సి.ఆర్ పేర్కొన్నారు.

 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల స్నేహ సంబంధాలను పటిష్ఠం చేయడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఇరువురు ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్ర, శనివారాల్లో సమావేశం కానున్నారు. గోదావరి, కృష్ణా నదులకు సంబంధించిన ప్రధానాంశాలు సహా 5 కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు.

 

తెలంగాణ నుంచి ఏడుగురు, ఏపీ నుంచి ఐదుగురు మంత్రులు హాజరవుతారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్‌కే జోషి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, నీటిపారుదల, ఆర్థిక, విద్యుత్‌, పౌరసరఫరాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సాధారణ పరిపాలన శాఖల ముఖ్యకార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.

 

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు ఏర్పాటైన కృష్ణా, గోదావరి బోర్డుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, వాటిని రద్దు చేయమని కేంద్రానికి సిఫార్సు చేయడంపైన, నీటి వినియోగం, మిగులు జలాల వాడకం తదితర అంశాలపై రెండు రాష్ట్రాలు ఓ అంగీకారానికి వచ్చి బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు ఇదే విషయాన్ని చెప్పడం తదితర అంశాల గురించి చర్చించనున్నట్లు తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: