తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల తొలి అధికారిక సమావేశం శుక్రవారం ప్రగతి భవన్ లో జరిగింది. అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా, సమర్థవంతంగా వినియోగించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మూలకు సాగునీరు, మంచినీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని కేసిఆర్, జగన్ స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభోపన్యాసం చేశారు... 

 

ఆయన ఏమన్నారంటే......

‘‘బేషజాలు లేవు. బేసిన్ల గొడవ లేదు. అపోహలు లేవు. వివాదాలు అక్కర్లేదు. వివాదాలే కావాలనుకుంటే మరో తరానికి కూడా మనం నీళ్ళివ్వలేము. కేసీఆర్, జగన్ లు వ్యక్తిగతంగా ఆలోచించరు. ప్రజలకోణం నుంచే ఆలోచిస్తరు. ప్రజలు నమ్మి మాకు ఓటేశారు. వారికి మేలు చేయడమే మా బాధ్యత. రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధాల్లో ఇప్పుడు గుణాత్మక మార్పు వచ్చింది. పూర్తి అవగాహనతో, పరిస్థితిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ, రెండు రాష్ట్రాల ప్రజలు మనవారే అనే భావనతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. ఎపి ముఖ్యమంత్రి జగన్ స్వచ్ఛమైన హృదయంతో వ్యవహరించారు. కలిసి నడుద్దామనుకున్నాం. 

 

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని ముఖ్యమంత్రులు కలిసి పాల్గొనడం మంచి సంకేతం ఇచ్చింది. మహారాష్ట్రతో సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోగలిగాం. అదే విధంగా రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలుంటే, అంతిమంగా ప్రజలకు మేలు కలుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ప్రజలకు ఎంత వీలయితే అంత మేలు చేయడమే మా లక్ష్యం’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

 

‘‘గోదావరి, కృష్ణా నదుల్లో కలిపి 4వేల టిఎంసిల నీటి లభ్యత ఉంది. ఈ నీళ్లను ఉపయోగించుకుని రెండు రాష్ట్రాలను సుభిక్షం చేయవచ్చు. కావాల్సినంత నీళ్లున్నాయి. ఆ నీళ్లను ఉపయోగించుకోవడానికి విజ్ఞత కావాలి. ఎన్ని నీళ్లను ఉపయోగించుకుంటామన్నది మన సమర్థత మీద ఆధారపడి ఉంది. ప్రతీ ఏటా దాదాపు 3వేల టిఎంసిల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. నీళ్లకోసం ట్రిబ్యునళ్ల చుట్టూ, కోర్టుల చుట్టూ,మరొకరి చుట్టూ తిరగడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుని, కలిసి నడిస్తే చాలు. రెండు నదుల్లో ఉన్న నీటిని రెండు రాష్ట్రాల ప్రజలకు వినియోగించే విషయంలో ఏకాభిప్రాయం ఉంటే చాలు. కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం అనే ప్రతిపాదన తెస్తున్నది. మన నదుల నీళ్లు మన అవసరాలు తీర్చాక కేంద్రం చెప్పే ప్రతిపాదన విషయంలో మనం నిర్ణయం తీసుకోవచ్చు.

 

 కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువ ఉన్నందున గోదావరి నది నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లకు నీటిని తరలించాలి. దీనివల్ల సాగునీటికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న రాయలసీమ, పాలమూరు, నల్గొండ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నీటి గోస తీరుతుంది. పోలవరం నుంచి వేలేరు ద్వారా విశాఖపట్నం వరకు నీళ్లు తీసుకుపోవాలి. వంశధార, నాగావళి నదుల నీళ్లను కూడా సముద్రం పాలు కాకుండా సమర్థంగా వినియోగిస్తే తమకు నీళ్లు రావడం లేదని, తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే ఉత్తరాంధ్ర వాసుల బాధ కూడా తీరుతంది’’ అని సిఎం కేసీఆర్ ప్రతిపాదించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: