కేంద్ర హోం మంత్రి అమిత్ షా త‌న తొలి ప్ర‌సంగంలోనే హాట్ హాట్ ప్ర‌సంగం చేశారు. జమ్ము కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు బిల్లు, జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లుకు మూజువాణి ఓటుతో శుక్రవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో జమ్ము కశ్మీర్‌లో జూలై 3 నుంచి మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన పొడిగించినట్లయింది. గతంలో జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లు తీసుకొచ్చారు. అలాగే జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ బిల్లు ద్వారా ఆ రాష్ట్రంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నివసిస్తున్న ప్రజలకు విద్య, ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన వెంటనే జమ్ము కశ్మీర్‌లో ప్రజాస్వామ్యయుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని అమిత్ షా లోక్‌సభలో వెల్లడించారు.


ఈ సందర్భంగా అమిత్‌షా గంభీర ప్ర‌సంగం చేశారు. ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని  స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటివరకు 132 సార్లు రాష్ట్రపతి పాలన విధిస్తే.. అందులో 93 సార్లు కాంగ్రెస్ హయాంలోనే విధించారని, రాష్ట్ర ప్రభుత్వాలను ఆ పార్టీ విచ్ఛిన్నం చేసిందని మండిపడ్డారు. మీరా మాకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పేది? అని కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదానికి, ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు కాంగ్రెస్ పార్టీనే కారణమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాల కారణంగానే జమ్ము కశ్మీర్ ప్రజలకు, దేశానికి మధ్య అంతరం పెరిగిందని విమర్శించారు. ఈ అంతరాన్ని పూడ్చి, రాష్ట్రం నుంచి ఉగ్రవాదాన్ని తరిమివేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.  భద్రతా సిబ్బంది కొరత కారణంగానే లోక్‌సభ ఎన్నికలతోపాటే ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో పరిస్థితులు మెరుగయ్యాయని, అమర్‌నాథ్‌యాత్ర ముగిసిన అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 తాత్కాలికమైనదేనని, శాశ్వతమైనది కాదని స్పష్టంచేశారు. 


లోక్‌సభలో తొలిసారి ప్రసంగించిన అమిత్‌షా.. కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ``ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌లో మూడో వంతు భూభాగం మన అధీనంలో లేదు. స్వాతంత్య్రానంతరం పాకిస్థాన్.. జమ్ముకశ్మీర్‌లోకి చొరబడి, మూడో వంతు ఆక్రమించుకున్న తర్వాత కాల్పుల విరమణ ప్రకటించినది ఎవరు? నెహ్రూనే. నాటి హోం మంత్రి, డిప్యూటీ ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అభిప్రాయాలను ఆయన పరిగణనలోకి తీసుకోలేదు`` అని షా విమర్శలు గుప్పించారు. కాల్పుల విరమణ ప్రకటించే ముందు సర్దార్ పటేల్‌ను పరిగణనలోకి తీసుకొని ఉంటే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏర్పడి ఉండేది కాదని, జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదానికి తావుండేది కాదని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తాను నెహ్రూ పేరుకు బదులుగా తొలి ప్రధానిగా సంబోధిస్తానని షా బదులిచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: