అవును! కొత్త‌గా ఏర్ప‌డిన ప్ర‌భుత్వం, లోటు బ‌డ్జెట్‌. గ‌త ప్ర‌భుత్వం ఈ లోటు బ‌డ్జెట్‌ను మ‌రింత లోతుకు తీసుకు వెళ్లింది.  విచ్చ‌ల‌విడి ఖ‌ర్చుల‌తో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రూ.2.65 లక్ష‌ల కోట్లు అప్పులు చేసింది. అయితే, ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చింది. వ‌చ్చీరావ‌డంతోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం మేనిఫెస్టోను అమ‌లు చేస్తాన‌ని ప్ర‌క‌టించి, దానిని అమ‌ల్లోకి కూడా తెచ్చారు. ఈ క్ర‌మంలోనే అమ్మ ఒడి కార్య‌క్ర‌మాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 26 నుంచి ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఉన్న అన్ని అనుమానాల‌ను కూడా నివృత్తి చేసేశారు.  ఇక‌, ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎప్ప‌టి నుంచో ఆశిస్తున్న ఐఆర్‌ను 27% పెంచుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 


అదేవిధంగా అంగ‌న్ వాడీల వేత‌నాన్ని పెంచారు. కాంట్రాక్టు ఉద్యోగుల వేత‌నాలు పెంచ‌డంతోపాటు వారిని రెగ్యుల‌ర్ చేస్తున్నారు. మ‌రోప‌క్క‌, ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసే ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ‌తో ఉన్న స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌ద్య నిషేధానికి సంబంధించిన విధి విధానాల‌పైనా దృష్టి పెట్టారు. ఇలా.. జ‌గ‌న్ దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డంపై అనేక రూపాల్లో విస్మ‌యం వ్య‌క్తం అవుతోంది. ప‌ట్టుమ‌ని నెల రోజులు కూడా కాక‌ముందుగానే జ‌గ‌న్ ఇలా దూకుడు ఎలా ప్ర‌ద‌ర్శిస్తున్నారు? ఇంత వేగంగా నిర్ణ‌యాలు ఎలా తీసుకుంటున్నారు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. 


అయితే, ఇదంతా జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా, చాలా ముందు చూపుతోనే చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వంతో ఎప్ప‌టిక‌ప్పుడు ట‌చ్‌లో ఉన్న జ‌గ‌న్‌.. అక్క‌డ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌కు అనుగుణంగానే ఇక్క‌డ వేగంగా పావులు క‌దుపుతున్నార‌ని చెబుతున్నారు. తాజాగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం జ‌మిలి ఎన్నిక‌లకు రంగాన్ని సిద్ధం చేస్తోంది. అంటే.. కేంద్ర ప్ర‌భుత్వానికి, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఒకే సారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌నేది మోడీ వ్యూహం. దీనివ‌ల్ల ఖ‌ర్చులు త‌గ్గ‌డంతోపాటు.. దేశంలో పెను రాజ‌కీయ మార్పులు చోటు చేసుకుంటాయ‌ని మోడీ భావిస్తున్నారు. 


దీనికి జ‌గ‌న్ కూడా జై కొట్టారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే 2022 ఆఖ‌ర్లో లేదా.. 2023 జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రిలో దేశంలోని అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ర‌ద్దు చేసి, కేంద్రం కూడా త‌నకు తానే ర‌ద్దు చేసుకుని ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నుంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న జ‌గ‌న్ .. మ‌రో రెండేళ్ల‌లో క‌నుక జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తే.. ఏపీలో మ‌రోసారి తానే అధికారంలోకి వ‌చ్చేలా ఇప్ప‌టి నుంచే చక్రం తిప్పుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వివిధ సంక్షేమ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచార‌ని అంటున్నారు. మ‌రి జ‌మిలి వ‌స్తే అప్ప‌టికి ఏపీ ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ ఎలాంటి మార్కులు వేయించుకుంటారు ? అప్పుడు ఏపీలో బీజేపీ ప‌రిస్థితి ఏంటి ?  చంద్ర‌బాబు పుంజుకుంటాడా ?  లేదా ? అన్న ప‌రిస్థితులు కూడా అప్ప‌టి ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపుతాయ్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: