ఆరు వారాల వేసవి సెలవుల అనంతరం జులై 1న సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభం కానుంది. సమస్యాత్మక అంశాలైన అయోధ్య వివాదం, రాఫెల్‌ కేసులో రివ్యూ పిటిషన్‌, రాహుల్‌ గాంధీ కోర్టు ధిక్కరణ కేసులతో పాటు పలు పిటిషన్‌లపై విచారణ చేపట్టాల్సి ఉంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోరు నేతృత్వంలో పూర్తి సంఖ్యా బలమైన 31 మంది న్యాయమూర్తులతో కూడిన అత్యున్నత న్యాయస్థానం.. రాఫెల్‌ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై తీర్పునిచ్చే అవకాశం ఉంది.

ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ గత ఏడాది డిసెంబర్‌లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పున: సమీక్షించాలంటూ కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌ శౌరి, యశ్వంత్‌ సిన్హాతో పాటు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ల పిటిషన్‌తోపాటు పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రధాని మోడీనుద్దేశించి 'చౌకీదార్‌ చోర్‌ హై' అన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. ఆయన కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ బిజెపి ఎంపి మీనాక్షి లేఖి పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ విషయంలో రాహుల్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పి.. కేసును మూసివేయాలని కోరిన సంగతి తెలిసిందే. అయోధ్య వివాదంలో 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామ్‌లల్లా, సున్ని వక్ఫ్‌బోర్డ్‌, నిర్మోహి అఖారా సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 14 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వివాదం పరిష్కారానికి మార్గాలు కనుగొనేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్‌ఎంఐ కల్లీఫుల్లాతోపాటు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌, సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచూలతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీకి ఆగస్టు 15 వరకూ ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం సమయం మంజూరు చేసింది.

విదేశీ నిధుల వినియోగం, రశీదులకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాద కార్యకర్తలు ఇందిరా జైసింగ్‌, ఆనంద్‌ గ్రోవర్‌, వారి ఎన్‌జిఒ 'లాయర్స్‌ కలెక్టివ్‌'పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపైనా విచారణ జరిపే అవకాశాలున్నాయి. న్యాయవాదుల స్వచ్ఛంద సంస్థ అయిన 'లాయర్స్‌ వాయిస్‌' పిటిషన్‌ దాఖలు చేసింది.

జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని సవాలు చేస్తూ బిజెపి నేత అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: