ప్రకృతి విపత్తులకు వేగవంతమైన, సమర్థ తరుణోపాయాలు అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వీటిని ఎదుర్కొనేందుకు ప్రపంచస్థాయి సంకీర్ణంలో చేరాలని జీ20 కూటమి దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. జపాన్‌లోని ఒసాకాలో జరిగిన ఈ కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ఆయన విపత్తులను తట్టుకునేలా భవితను తీర్చిదిద్దే అంశంపై ఎక్కువ దృష్టి పెట్టారు.

ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి ఒక అంతర్జాతీయ కూటమి అవసరమని బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగిన జీ20 సదస్సులో గట్టిగా ప్రస్తావించా. ఈ కూటమిలో చేరి, మీ అనుభవాలను, నైపుణ్యాన్ని పంచుకోవాలి’’ అని ఆయన కోరారు. ఉగ్రవాదం, అతివాదానికి నిధులు, మద్దతు కోసం ఇంటర్నెట్‌ను ఉపయోగించకుండా చూడాలని జీ20 కూటమిలోని ఇతర దేశాల నేతలు తీర్మానించారు. 

ఈ దిశగా ఆన్‌లైన్‌ వేదికలు చర్యలు చేపట్టాలన్నారు. ఐరాస తీర్మానాలు, ఉగ్రవాదంపై పోరుకు సంబంధించిన ఇతర ఒప్పందాలను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఒసాకాలో శనివారం వరుస సమావేశాలతో మోదీ తీరిక లేకుండా గడిపారు. ఇండోనేసియా, బ్రెజిల్‌, టర్కీ, ఆస్ట్రేలియా, సింగపూర్‌, చిలీ దేశాల నేతలతో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. వాణిజ్యం, ఉగ్రవాదంపై పోరు, రక్షణ, సముద్ర భద్రత, క్రీడలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. 

భారత సంప్రదాయ చికిత్స విధానాలైన యోగా, ఆయుష్‌, తన ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య పథకం గురించి శనివారం జీ20 సదస్సులో మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల అంశాన్ని గట్టిగా ఎదుర్కోవాలని కూడా మోదీ పిలుపునిచ్చినట్లు సురేశ్‌ ప్రభు చెప్పారు. పన్ను ఎగవేతలు, అవినీతి వంటి అంశాలనూ ప్రస్తావించారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: