తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇలాకా అనే పేరున్న ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌రిణామాలు మారుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి షాకిస్తూ...ఇటీవ‌లే ఇక్క‌డ ఎంపీ సీటును గెలుచుకున్న బీజేపీ పార్టీ బలోపేతానికి వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది. తాజాగా క‌రీంన‌గ‌ర్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బండి సంజ‌య్ మ‌రోమారు అనూహ్య రీతిలో వార్త‌ల్లో నిలిచారు. కాలిన‌డ‌కన 37 కిలోమీట‌ర్లు న‌డిచి తెలంగాణ‌లో ల‌క్ష‌లాది మంది భ‌క్తుల ఆరాధ్య‌దైవ‌మైన  కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు. 



కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కాలినడకన శనివారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరి కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించి ‘హనుమాన్‌ పరిక్రమ పాదయాత్ర’ ప్రారంభించారు. కొత్తపల్లి, రామడుగు, గంగాధర, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలాల మీదుగా 37 కిలోమీటర్లు.. 12గంటల పాటు నడిచి రాత్రి 7 గంటలకు అంజన్న సన్నిధికి చేరుకున్నారు. ఎంపీగా గెలిచాక కాలినడకన కొండగట్టుకు వస్తానని మొక్కుకున్నారు. ఇప్పుడు ఆ మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. హనుమాన్‌ పరిక్రమ పాదయాత్ర స్ఫూర్తితో రానున్న రోజుల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు అమలు కోసం పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొండగట్టు ప్రాంత అభివృద్ధి కోసం పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ఘాట్‌రోడ్డు ప్రమాదంలో అనేక మంది పేదలు మృతి చెందారని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రణాళికబద్దమైన అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కొండగట్టు ఘాట్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని స్వామి వారిని వేడుకుంటున్నట్లు చెప్పారు.


దీంతోపాటుగా రాష్ట్ర ప్ర‌భుత్వానికి షాకిచ్చేలా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ కామెంట్లు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అభివృద్ధి కోసం దేవస్థానం కమిటి అనుసంధానంతో ప్రత్యేక ‘యాప్’ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో విస్తృతమైన సౌకర్యాలు ఏర్పరిచేందుకు, ప్రజలంతా పుణ్యక్షేత్ర అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించనున్నట్లు వివరించారు. త్వరలోనే దేవాలయ అధికారులు, జగిత్యాల జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: