జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబునాయుడుకు చుక్కలు కనిపించేట్లే ఉన్నాయి. నెల రోజుల పాలనలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఓ వ్యూహం ప్రకారమే అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా అర్ధమైపోతోంది. జగన్ ఆలోచనలు చూస్తుంటే నేరుగా ప్రజలతోనే పొత్తు పెట్టుకునేట్లే కనబడుతోంది.

 

నెల రోజుల పాలనలో ప్రజలకు బాగా ఉపయోగపడే నిర్ణయాలనే తీసుకున్నారు. అంగన్ వాడీ వర్కర్లకు జీతాలు పెంపు, ఆశా వర్కర్లకు వేతనాలు పెంచారు. సుమారు 5 లక్షల మంది ఉద్యోగులకు మధ్యంతర భృతిని 27 శాతం పెంచారు. దీని వల్ల రిటైర్డ్ ఉద్యోగులకు కూడా లాభం జరుగుతుంది. జనవరి 26కి అమ్మఒడి, వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు పంపిణి చేయాలని డిసైడ్ అయ్యారు. పైగా ఇచ్చే పట్టాలు కూడా మహిళ పేరుతోనే ఇవ్వబోతున్నారు.

 

అలాగే 5 లక్షల మంది గ్రామ వాలంటీర్ల నియామకాలు జరగబోతున్నాయి. ప్రభుత్వ పథకాలను ఇకనుండి లబ్దిదారులకు నేరుగా డోర్ డెలవరి చేయబోతున్నారు. ఈ నిర్ణయం గనుక సక్రమంగా అమలైతే ఒకేసారి దాదాపు కోటిమంది లబ్దిదారులకు ఉపయోగం జరుగుతుంది.  అక్బోటర్ 15వ తేదీ నుండి రైతు భరోసా ప్రారభం అవుతోంది. జగన్ అనుకున్నట్లు జరిగితే నిజంగానే లక్షలాది మంది అన్నదాతలకు భరోసా దొరికినట్లే.

 

ఇక సంవత్సరాల తరబడి అపరిష్కృతంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల విషయం చూద్దాం. బాధితుల తక్షణ ఉపశమనం క్రింద రూ 1150 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. దీనివల్ల సుమారు 10 లక్షల మందికి లాభం జరుగుతుంది. ఇవి కాకుండా సామాజిక న్యాయం పేరుతో పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు, మైనారిటిలకు పెద్ద పీట వేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల జాబితా చూసినా లేదా మంత్రివర్గాన్ని చూసినా ఈ విషయం స్పష్టంగా బోధపడుతుంది.

 

ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాలు, రేపు అమలు కాబోయే నిర్ణయాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనకు తప్ప మరో పార్టీకి ఓటు వేయటానికి కూడా ఆలోచించకూడదనే అనుకున్నట్లున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే అధికారంలో ఉన్న టిడిపిని ఊడ్చిపారేశాడు. 175 సీట్లలో ఏకంగా 151 సీట్లను గెలుచుకున్నాడు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి స్పష్టమైన అజెండాతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఇదే ఒరవడితో ముందుకుపోతే రేపు జమిలి ఎన్నికలు అమలై 2023లోనే ఎన్నికలొస్తే టిడిపికి ఇపుడొచ్చిన 23 సీట్లైనా వస్తాయా ?


మరింత సమాచారం తెలుసుకోండి: