అనూహ్య వార్త‌తో దుబాయ్ రాజు, యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వార్త‌ల్లోకి ఎక్కారు. గ‌త ఏడాది కూతురు కార‌ణంగా వార్త‌ల్లో నిలిచిన ఈ రాజు ఈ ద‌ఫా త‌న ఆరో భార్య ద్వారా మ‌ళ్లీ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. దుబాయ్ రాజు ఆరో భార్య‌ ప్రిన్సెస్ హయా బింత్ అల్ హుస్సేన్ దుబాయ్ విడిచిపెట్టి వెళ్లారు. ఇంటినుంచి రూ.271 కోట్లతో తన ఇద్దరు పిల్లలతో రహస్యంగా ఆమె దుబాయ్ నుంచి లండన్‌కు వెళ్లిందన్న వార్తలు చర్చనీయాంశమవుతున్నాయి.


హయా జోర్డన్ రాజుకు వరుసకు సోదరి. 2004లో రషీద్‌తో ఆమెకు వివాహం జరిగింది. ఇటీవల భర్త రషీద్‌తో విడాకులు తీసుకున్న హయా.. ఓ జర్మనీ దౌత్తవేత్త సాయంతో లండన్‌కెళ్లిన ట్టు తెలుస్తున్నది. దుబాయ్‌లో తన ప్రాణాలకు ముప్పు ఉందనే ఆమె ఈ పని చేసిందని, తనకు జర్మనీలో ఆశ్రయం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. దుబాయ్, జర్మనీ మధ్య దౌత్య వైరుధ్యాల నేపథ్యంలో.. తన భార్య ను తిరిగి అప్పగించాలన్న రషీద్ అభ్యర్థనను జర్మనీ తోసిపుచ్చినట్టు వార్తలొచ్చాయి. ఇదిలాఉండ‌గా,  గతేడాది షేక్ మహమ్మద్ కూతురు ప్రిన్సెస్ లతిఫా పారిపోయేందుకు యత్నించగా, ఇండియ న్ కోస్ట్‌లో పట్టుకున్నారు. కూతురు మాదిరే హయా కూడా భర్త వేధింపులు తట్టుకోలేక అదే పని చేసిందని మానవ హక్కుల కార్యకర్త రాధా స్టిర్లింగ్ పేర్కొన్నారు.


ప్రిన్సెస్ లతీఫా ఉదంతం ప్ర‌పంచం చూపును ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే. దుబాయ్ రాజు, ఆ దేశ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్-అల్-మక్తూమ్ కుమార్తె షేక్ ల‌తీఫా. ఆరుగురు భార్యలున్న దుబాయ్ రాజుకు 30మంది సంతానంలో లతీఫా ఒకరు. పేరుకే రాకుమారి కానీ, ఆంక్షల చట్రంలో ఆమె బందీ. ఆ ఆంక్షలను ఛేదించుకుని స్వేచ్ఛగా ఎగిరిపోవాలని భావించిన ఆ యువరాణి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెబుతున్న వివరాల ప్రకారం.. కన్నతండ్రి నుంచే ఆమె తీవ్ర వేధింపులు ఎదుర్కొంది. తనకున్న అధికార దర్పంతో చీకటి గదిలో ఆమెను మూడేళ్ల‌పాటు బంధించి చిత్రహింసలు పెట్టారు. ఎలాగైనా దేశం విడిచి పారిపోవాలని నిర్ణయించుకున్న లతీఫా.. అమెరికాలో కొత్త జీవితం ప్రారంభించాలని భావించారు. ఫిన్లాండ్‌కు చెందిన తన స్నేహితురాలు టీనా జౌహానియస్, ఫ్రాన్స్‌కు చెందిన కెప్టెన్ హెర్వ్ జాబెర్ట్, మరో ముగ్గురు సిబ్బందితో కలిసి అధికారుల కళ్లుగప్పి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో వారు ఒక బోటులో దుబాయ్ నుంచి బయటపడ్డారు. అయితే, గత మార్చి 14న వీరి బోటు భారత్‌లోని గోవా జలాల్లోకి ప్రవేశించింది. తీరానికి 20కిలోమీటర్ల దూరంలోనే వారిని తీరగస్తీ దళం కమెండోలు అదుపులోకి తీసుకున్నారు. తాను ఆశ్రయం కోరి వచ్చానని ఆమె ఆరుస్తున్నా వినిపించుకోకుండా వారిని బంధించి, యూఏఈ అధికారులకు సమాచారమందించారు. హెలికాప్టర్‌లో వచ్చిన అధికారులకు వారిని అప్పగించి పంపించివేశారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది. 


కాగా, దేశం నుంచి పారిపోయేందుకు ల‌తీఫా చేసిన ప్ర‌యత్నా అడ్డుకోవ‌డంలో భారత్‌ సహాయపడటంతో యూఏఈ భారీ స‌హాయం చేసింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో కీలక నిందితుడైన క్రిస్టియన్ మిషెల్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ప్రభుత్వం భారత్‌కు గ‌త ఏడాదే అప్పగించింది. 19నెలల క్రితమే ఆయనను అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసినా స్పందించని యూఏఈ ప్రభుత్వం..ఆగమేఘాలపై న్యాయప్రక్రియ పూర్తిచేసి ఇండియాకు ఆయనను అప్పగించడం వెనుక దుబాయ్ యువరాణి షేకా లతీఫా ఉదంతం ఉన్నట్లు వార్త‌లు వ‌చ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: