పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన ఆధ్వర్యంలో ఈ ఇనిస్టిట్యూట్ నడిపించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పాలకొల్లులో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యను ఆదివారం పరామర్శించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 'శ్రీ ఎస్వీ రంగారావు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్ ' పేరుతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు జనసేన విడుదల చేసిన అఫీషియల్ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు.

‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పాలకొల్లు నుంచి ఎందరో వచ్చారు. అల్లు రామలింగయ్య గారు, దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు... ఇలా చాలా మంది పాలకొల్లు నుంచి వచ్చినవారే. నవతరంలో ఉన్న నైపుణ్యాన్ని తీర్చిదిద్దేలా పాలకొల్లులో శ్రీ ఎస్వీ రంగారావు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్ జనసేన అధ్వర్యంలో నెలకొల్పనున్నాం' అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కి హరిరామ జోగయ్య గారు చైర్మన్‌‌గా వ్యవహరిస్తారు. వీరు నిర్మాతగాను ఎన్నో మంచి చిత్రాలు అందించారు. రాజా వన్నెంరెడ్డి, బన్నీ వాసు నేతృత్వంలో ఐ ఇనిస్టిట్యూట్ నడుస్తుంది. ఇందుకు నా అండదండలు ఉంటాయి. ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల యువతకు ఉపయోగపడేలా ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

హరిరామ జోగయ్య మాట్లాడుతూ ‘చిరంజీవిగారి కుటుంబం అంటే ఎంతో ఇష్టం. పవన్‌ కళ్యాణ్‌ గారికి అభిమానిని. జనసేన పార్టీకి ఎప్పుడూ నా సహాయసహకారాలు ఉంటాయి. చివరి శ్వాస వరకూ జనసేన కోసమే పని చేస్తాను. ప్రజలందరి క్షేమం కోరుకొంటూ అందరినీ సురక్షితంగా చూసుకునే పార్టీ ఇది. అందరం పవన్‌ కళ్యాణ్‌ గారి వెన్నంటి నడుద్దాం' అన్నారు. పాలకొల్లు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్ ‌లో నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ ఇస్తాం. రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్‌‌గా వ్యవహరిస్తారు. శిక్షణ విధానం, ఫ్యాకల్టీ సిద్ధం అయింది. ఈ శిక్షణాలయం ప్రారంభానికి పవన్‌ కళ్యాణ్‌ వస్తారు' అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: