కార్టూన్‌ పేలింది...ఉద్యోగం ఊడింది...

ఆయన వేసిన కార్టూన్‌ చూసి అందరూ ఆశ్చర్య పోయారు. అద్బుతం, అమోఘం అంటూ ప్రశంసలు కురిపించారు. కానీ ఆ పొలిటికల్‌ కార్టూనిస్ట్‌ ఉద్యోగం ఊడింది. ఇదేమీ తెలుగు పత్రికల్లో జరిగిన ముచ్చట కాదు. అంత సీన్‌ ప్రస్తుతానికి తెలుగు నాట లేదు కానీ, ఇక చదవండి...

ఇంతకీ ఆ కార్టూన్‌ వెనుక కథ ఏమిటంటే..?

వలసదారుల అవస్థలపై స్పందించిన కెనడియన్‌ కార్టూనిస్ట్‌ మైఖేల్‌ డి ఆడెర్‌ ఒక కార్టూన్‌ను వేశాడు. ఇది బ్రూన్స్‌విక్‌ పత్రికలో ప్రచురించారు. ఇది కెనడా, అమెరికా వ్యాప్తంగా లక్షలాది పాఠకుల మనసులను గెల్చుకుంది. అదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను విమర్శిస్తూ ఆ కార్టూన్‌ గీసినందుకు ఆ కార్టూనిస్టు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు.

ఇటీవల ఎల్‌ సాల్వడార్‌ నుంచి మెక్సికో ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన తండ్రీ బిడ్డలు (ఆస్కార్‌ అల్బెర్టో మార్టినెజ్‌ రామిరేజ్‌, అతని 23 నెలల కుమార్తె వాలెరియా) ప్రాణాలు పోగొట్టుకున్నసంగతి తెలిసిందే. వీరి ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయింది.

దీంతో స్పందించిన కార్టూనిస్టు ఆడెర్‌ సరిహద్దు వివాదాలపై వ్యంగ్యంగా వలసదారుల శవాలపై ట్రంప్‌ గోల్ఫ్‌ ఆడుతున్నట్లుగా కార్టూన్‌ వేశారు. బ్రహ్మండంగా పేలింది. ప్రఖ్యాత అంతర్జాతీయ అవార్డు పులిట్జర్‌ బహుమతికి యోగ్యమైందంటూ పలువురు సెలబ్రిటీలు,రాజకీయ విశ్లేషకులు పొగడ్తల్లో ముంచెత్తారు. కానీ ఆ కార్టూనిస్టు ఉద్యోగం మాత్రం ప్రమాదంలో పడిపోయింది.

'' తనను ఉద్యోగంనుంచి తొలగించారని ఆడెర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దీంతో పలువురు కార్టూనిస్టులు, ప్రముఖులు ఆడెర్‌కు మద్దతుగా నిలిచారు. ట్రంప్‌పై కార్టూన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన 24 గంటల తరువాత ఆడెర్‌ను తొలగించారని కెనడియన్‌ కార్టూనిస్టుల సంఘం అధ్యక్షుడు వెస్‌ టైరెల్‌ ఆరోపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: