తెలుగుదేశంపార్టీకి అనంతపురం జిల్లాలో జేసి ఫ్యామిలీ పెద్ద షాకే ఇచ్చంది. ఎన్నికల తర్వాత అనంతపురం హెడ్ క్వార్టర్స్ లో జరిగిన జిల్లా పార్టీ సమన్వయ కమిటి సమావేశానికి జేసి ఫ్యామిలీ మొత్తం గైర్హాజరయ్యింది. ఫ్యామిలి నుండి కనీసం ఒక్కరు కూడా హాజరుకాకపోవటం జిల్లా పార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది.

 

సమన్వయ కమిటి సమావేశానికి జిల్లాలోని మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులుతో పాటు చాలామంది మాజీ ఎంఎల్ఏలు, మాజీ ఎంపిలు హాజరయ్యారు. చివరకు ద్వితీయ శ్రేణి నేతలు కూడా హాజరయ్యారు. ఇంతమంది హాజరైన సమావేశానికి జేసి బ్రదర్స్ కానీ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళ కొడుకులు జేసి పవన్ రెడ్డి, జేసి అస్మిత్ రెడ్డి కూడా హాజరుకాలేదు.

 

సరే వీళ్ళతో పాటు అనంతపురం మాజీ ఎంఎల్ఏ వైకుంఠం ప్రభాకర్ చౌదరి, హిందుపురం మాజీ ఎంపి నిమ్మల కిష్టప్ప కూడా హాజరుకాలేదు లేండి. ఇప్పటికే తమను బిజెపిలో చేరాలంటూ బిజెపి అగ్రనేతలు ఆహ్వానించారని ఆమధ్య జేసి చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. అంతటి ఆగకుండా జిల్లాలోని చాలామంది నేతలతో బిజెపి టచ్ లో ఉన్నారంటూ పెద్ద బాంబే పేల్చారు.

 

జేసి ప్రకటన చేయగానే ఉలిక్కిపడిన చంద్రబాబు వెంటనే ఆరా తీయటం మొదలుపెట్టారు. దానికి తగ్గట్లుగానే రెండు రోజుల క్రితమే ధర్మవరం మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి బిజెపిలో చేరిపోయారు. దాంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే సమన్వయ కమిటి సమావేశం మొదలైన దగ్గర నుండి చంద్రబాబు పదే పదే ఫోన్లు చేసి సమావేశం వివరాలు తెలుసుకున్నారు.

 

మొత్తానికి సమావేశానికి జేసి బ్రదర్స్ గైర్హాజరవ్వటం జిల్లాలో పెద్ద కలకలమే రేపింది. బిజెపిలో చేరేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే  సమావేశానికి రాలేదా ? లేకపోతే ఏదైనా వ్యక్తిగత కారణాలతో రాలేదా ? అనే విషయాన్ని చంద్రబాబు ఆరా తీస్తున్నారు. వీళ్ళతో పాటు కిష్టప్ప, ప్రభాకర్ చౌదరి విషయంపైన కూడా కూపీ లాగుతున్నారు చంద్రబాబు. మొత్తానికి ఏ రోజు ఎవరు షాకిస్తారో పాపం చంద్రబాబుకు అర్ధం కావటం లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: