తాజా లోక్‌స‌భ‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీలో ఉన్న నేతల్లో ఒక్కొక్కరూ ఎప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేద్దామా అన్న ఆలోచనతోనే ఉన్నారు. కాంగ్రెస్‌ను గల్లీ నుంచి ఢిల్లీ దాకా మోడీ, అమిత్ షా ద్వయం వెంటాడుతున్నారు. బిజెపి వైపు చూసిన వాళ్లను వెంటనే తమ పార్టీలోకి లాగేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాదిపై కన్నేసిన కమలదళం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల పై ప్రత్యేక దృష్టి సారించింది. 


ఏపీలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కీలక నేతలను బిజెపిలోకి లాక్కున్న ఆ పార్టీ అధిష్టానం ఇప్పుడు తెలంగాణలో కూడా పలువురు నేతలపై వల వేసింది. తెలంగాణలో తాజా లోక్‌స‌భ ఎన్నికల్లో బిజెపి ఎవరు ఊహించని విధంగా నాలుగు లోక్‌స‌భ స్థానాలు గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు  కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్ రెడ్డికి అమిత్ షా రెడ్ కార్పెట్ పరిచినట్టు తెలుస్తుంది. 


గత అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌న‌గర్ సీటు ఆశించి భంగపడ్డ మర్రి శశిధర్ రెడ్డి అప్పటి నుంచి పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరి శ‌శిధ‌ర్‌ రెడ్డితో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర‌సింహ సతీమణి పద్మని కూడా పార్టీ మారే అవకాశం ఉంది. విచిత్రం ఏంటంటే ఎన్నికల సమయంలో బిజెపిలో చేరిన ఆమె తిరిగి గంటలోనే కాంగ్రెస్ గూటికి చేరి అందరికి షాక్ ఇచ్చారు. 


ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని క్లారిటీకి వచ్చిన ఆమె తిరిగి బిజెపి తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారట. ఈ నెల 6న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఈ ఇద్దరితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: