2014 ఎన్నికల్లో మిత్రులు, 2018 వరకూ అలాగే ఉన్నారు. ఒక్కసారిగా పవన్ స్టాండ్ మార్చుకుని సొంత దుకాణం తెరిచారు. ఇక 2019 ఎన్నికల్లో విడివిడిగా టీడీపీ, జనసేన పోటీ చేశారు. ఇది బాబు మార్క్ రాజకీయ ఎత్తుగడ అని వైసీపీ వూరూ వాడా ప్రచారం చేసింది. విడిగా ఉంటూనే లోపల కలసి పోయారని కూడా గట్టిగా జనంలోకి తీసుకొచ్చింది. దాంతో అటు బాబు, ఇటు పవన్ ఇద్దరూ రాజకీయంగా దారుణంగా దెబ్బతిన్నారు.


చరిత్రలో ఎన్నడూ చూడని ఓటమి చంద్రబాబుకు వస్తే ఏకంగా పోటీ చేసిన రెండు సీట్లలోనూ ఘోరంగా ఓడిపోయి సున్నా చుట్టేసిన చరిత్ర పవన్ ది. ఇక కొత్త ప్రభుత్వం, పాత శత్రువు జగన్ ఉన్నారు. అందుకే మళ్ళీ కలసిపోవాలనుకుంటున్నట్లుగా  వార్తలు   షికార్లు కొడుతున్నాయి. చంద్రబాబుతో టీడీపీ కాపు నాయకులు భేటీ సందర్భంగా పవన్ని చేరదీయాలని చెప్పినట్లుగా వార్త బయటకు వచ్చింది.


పవన్ తో పొత్తు పెట్టుకుని ఉంటే టీడీపీ గెలిచేదని కూడా బాబుకు పసుపు పార్టీ కాపులు చెప్పారట. బాబు కూడా రాజకీయ సమీకరణలు అన్నీ చూసుకుని అవుననే  అన్నారట. అంటే ఇప్పటికిపుడు కాకపోయినా లోకల్ బాడీ ఎన్నికల నాటికి రెండు పార్టీ కలసి జగన్ మీదకు ఉమ్మడిగా యుధ్ధానికి వస్తాయన్నమాట.


పవన్ కూడా ఇపుడు టీడీపీ పద్ధతిలోనే విమర్శలు చేస్తున్నారు. రైతులకు విత్తనాలు అందడం లేదని టీడీపీ అంటే పవన్ ఏకంగా జగన్ సర్కార్ కి లేఖ రాశారు. అంటే ఇద్దరి ఆలోచనలూ ఒక్కటిగా ఉన్నాయి. ఇక జగన్ గెలుపుపై ఇప్పటికీ టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తూంటే పవన్ సైతం ఎలా ఓడిపోయామని అనుమానంతో  ఉన్నారు. ఇద్దరూ పాత మిత్రులే కాబట్టి శత్రువు ఉమ్మడి వాడు కాబట్టి కలసిపోయినా ఆశ్చర్యం లేదు. అది తొందరలోనే జరుగుతుందని కూడా అంటున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: