ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కోసం చంద్రబాబు వేల ఎకరాల భూమిని సేకరించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. చంద్రబాబు భూసేకరణ అని కాకుండా భూసమీకరణ అంటూ రాజధాని కోసం భూమిని సమీకరించారు. ఆ భూసమీకరణలను తీవ్రంగా వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది.. ఆ పార్టీ అధినేత సీఎం జగన్ కూడా చంద్రబాబు మాదిరిగానే భూసేకరణకు సిద్ధమవుతున్నారు.

 

చంద్రబాబు సేకరించిన కంటే రెట్టింపు భూమిని రాష్ట్రవ్యాప్తంగా సేకరించడానికి జగన్ ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం భూమి సేకరిస్తే.. జగన్ గృహనిర్మాణ పథకం కోసం భూమిని సేకరిస్తున్నారట. జగన్ ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఉగాది నాడు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25 లక్షల మంది నిరుపేదలకు ఒకేరోజున ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు అందించాలనుకుంటున్నారు.

 

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సుమారు 4,500 ఎకరాల భూమి మాత్రమే అందుబాటు లో ఉంది. 25 లక్షల మందికి ఒక్కొక్కరికి 75 చదరపు గజాల నివాస స్థలాన్ని కేటాయించాలంటే మొత్తం 80 వేల ఎకరాల భూమి అవసరం ఉంది. అంటే... మరో 75,500 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూమిని ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుండి కొనుగోలు చేయాల్సి ఉంది.

 

75,500 ఎకరాల భూమిని సేకరించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పెద్ద ఎత్తున భూసేకరణ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. కాగా తమ ప్రభుత్వ హయాంలోని భూసేకరణలపై రచ్చ చేసిన జగన్ ఇప్పుడు తాను ఎలా ఇంత భూమిని సేకరిస్తారని టీడీపీ నేతలు కచ్చితంగా ప్రశ్నిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: