ఏపీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి తెలుగుదేశం పార్టీ  వాళ్లు వైసీపీతో పాటు సీఎం జ‌గ‌న్‌పై అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. జ‌గ‌న్ తొలి నెల రోజుల పాటు ప్ర‌తిప‌క్షాల‌కు చోటు ఇవ్వ‌కుండా పాల‌న చేసినా టీడీపీ వాళ్లు మాత్రం ఏదో ఒక విమ‌ర్శ చేయాలి అన్న‌ట్టుగా చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ నేత‌ల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని విమ‌ర్శ‌లు చేస్తోన్న ఆ పార్టీ నేత‌లు త‌మ అధినేత చంద్ర‌బాబుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అప్పుడే భ‌ద్ర‌త త‌గ్గించేసింద‌ని కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.


అయితే ఈ విమ‌ర్శ‌ల‌పై ఏపీ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత స్పందించారు. చంద్రబాబు నాయుడుకు భద్రత తగ్గించామనడంలో వాస్తవం లేదని సుచరిత స్పష్టం చేశారు. చంద్రబాబుకు భద్రత తగ్గించారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. మంగళవారం ఈ విష‌య‌మై మీడియాతో మాట్లాడిన ఆమె బాబు తీరును దుయ్య‌బ‌ట్టారు. చంద్ర‌బాబు ఇప్ప‌ట‌కీ తానే సీఎం అన్న భ్ర‌మ‌ల్లో ఉన్నార‌ని ఆమె ఎద్దేవా చేశారు.


చంద్రబాబుకు జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పిస్తున్నామన్న ఆమె ఆయ‌న‌కు ఉండాల్సిన భ‌ద్ర‌త కంటే ఎక్కువే ఇస్తున్నామ‌న్నారు. 58 మంది ఇవ్వాల్సి చోట 74 మందితో భద్రత కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఇక చంద్రబాబుకు చెందిన ప్రైవేటు ఆస్తులకు రక్షణ కల్పించడం కుదరదన్న ఆమె అక్రమ కట్టడాల కూల్చివేతల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే టీడీపీ నేత‌లు చంద్ర‌బాబు భ‌ద్ర‌త అంశాన్ని తెర‌మీద‌కు తెచ్చార‌ని విమ‌ర్శించారు. గతంలో ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేతలను తనిఖీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: