వైసీపీ కొత్తగా ఏపీలో అధికారంలోకి వచ్చింది. పూర్తి బడ్జెట్ ని ఈ నెల 12న అసెంబ్లీ వేదికగా ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించి భారీ కసరత్తు జరుగుతోంది.  జగన్ కుడి భుజం ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బడ్జెట్ రూపకల్పనలో ప్రస్తుతం  తలమునకలై ఉన్నారు.


ఇదిలా ఉండగా జగన్ తన బడ్జెట్ లో నవ రత్నాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి సంబంధించి 66 వేల కోట్ల పై చిలుకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొత్తం బడ్జెట్ రెండు లక్షల కోట్లతో రూపొందిస్తే అందులో మూడ‌వ వంతు మొత్తం నవరత్నాలకే ఖర్చు చేయనున్నారు. ఇక అమ్మ ఒడి పధకానికి నాలుగున్న వేల కోట్ల  పై చిలుకు ఈ ఏడాది బడ్జెట్ లో కేటాయిస్తున్నారు. అలాగే వివిధ హామీలకు కూడా జగన్ బడ్జెట్లో చాలా భారీ కేటాయింపులే ఉండేలా చూశారు.


ఇదిలా ఉండగా అమరావతి రాజ‌ధాని నిర్మాణం కోసం మాత్రం మూడు వందల కోట్లనే ఈ ఏడాది  కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే కనుక నిజమైతే బాబుకు షాకే మరి. ఆయన కలల నగరంగా చెప్పుకునే అమరావతి పూర్తి కావడానికి రెండు లక్షల కోట్లు అవసరం. మరి మూడు వందల కోట్లతో అంటే జరిగే పని కాదన్న మాట. మరి జగన్ అమరావతి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఈసారి బడ్జెట్ సమావేశాల్లోనే తేటతెల్లంగా వివరిస్తారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: