ఆంధ్ర ప్రదేశ్ లో విత్తనాల కొరత ను లక్ష్యంగా చేసుకుని   జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై తెలుగుదేశం పార్టీ నేతలు మూకుమ్మడి దాడి చేస్తున్నారు . తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్తోపాటు  , ఇక ఇప్పుడు వ్యవసాయ శాఖ మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లు వైకాపా ప్రభుత్వ తీరును , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు . గతం లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాం విత్తనాల కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడేవారని , ఇప్పుడు మళ్లీ అవే పరిస్థితులు పునరావృత్తం అవుతున్నాయని సోమిరెడ్డి అన్నారు .


 టీడీపీ హయాం లో విత్తనాల కొరత లేకుండా చూశామని , ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే అన్ని రకాల విత్తనాలు 70 శాతం సిద్ధం చేశామని చెప్పారు . అంతలోనే ఎన్నికల కోడ్ వచ్చిందని , ఎన్నికల కోడ్ వచ్చాక అనధికారికంగా వైకాపా పెత్తనం చలాయించి , అధికారులను బదిలీ చేయించిందన్నారు . కనీసం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించకుండా అడ్డుకుందని చెప్పారు . రైతులకు విత్తనాలు అందించలేని వైకాపా ప్రభుత్వం తమపై నిందలు వేసి తప్పించుకోవాలని చూస్తోందని ధ్వజమెత్తారు .


 టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు , అధికార పార్టీ నుంచి కేవలం ఒక్క వ్యవసాయ శాఖ మంత్రి మాత్రమే స్పందిస్తూ పరోక్షంగా విత్తనాల కొరత ఉండనే విషయాన్ని అంగీకరించడం చర్చనీయాంశంగా మారింది  .  గత  టీడీపీ ప్రభుత్వం జనవరి వరకు విత్తనాల సేకరణ కు నిధులు విడుదల చేయలేదంటూ , నిధులన్నీ పసుపు , కుంకుమ పథకానికి మళ్లించిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు  ఆరోపించారు . అయితే మంత్రి ఆరోపణలను వ్యవసాయ శాఖ మాజీ మంత్రిగా సోమిరెడ్డి ఖండిస్తూ తాము 70 శాతం విత్తన సేకరణ చేసినట్లు పేర్కొంటున్నారు . అధికార, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్న రాష్ట్ర రైతాంగం విత్తనాల కొరత ఇబ్బందులు పడుతుండడం ఆందోళన కలిగించే అంశం .


మరింత సమాచారం తెలుసుకోండి: