అధికార వైకాపా పై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలతో విరుచుకుపడిపోతుంటే కేవలం మంత్రులు మాత్రమే స్పందిస్తున్నారు తప్పిస్తే , పార్టీ నేతలు నోరు మెడకపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో  హాట్ టాఫిక్ గా మారింది . టీడీపీ అధికారం లో ఉండగా ఆ పార్టీ నేతలు , మంత్రులు చేసే విమర్శలను, ఎప్పటికప్పుడు  తిప్పికొట్టేందుకు పలువురు వైకాపా నేతలు ముందుకు వచ్చేవారు . కానీ పార్టీ అధికారంలోకి రాగానే సీన్ పూర్తిగా మారిపోయింది .  గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి , ఆనాటి  ప్రతిపక్ష  నేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు , మంత్రులు తరుచూ విమర్శలు గుప్పించేవారు .


 ప్రతిపక్ష నేతపై వారు చేసిన విమర్శలకు మీడియా కూడా అధిక ప్రాధాన్యతనిచ్చి కవరేజ్ ఇచ్చేది . మంత్రులు, టీడీపీ నేతలు చేసిన విమర్శలకు తమకు మీడియా అండదండలు లేకపోయినా వైకాపా నేతలు ధీటుగా తిప్పికొట్టే ప్రయత్నాన్ని చేసేవారు . జగన్మోహన్ రెడ్డి ని విమర్శిస్తే సహించేది లేదన్నట్లు వ్యవహరించిన అంబటి రాంబాబు , రోజా , చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  వంటి వారు, పార్టీ అధికారంలోకి వచ్చాక  ప్రస్తుతం మౌనముద్ర దాల్చడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది . జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో రోజా, చెవిరెడ్డి , అంబటి రాంబాబు లు స్థానాన్ని ఆశించారు . కానీ సామాజిక సమీకరణాలు , ఇతరత్రా కారణాల వల్ల  ఆయన వారికి స్థానం కల్పించలేకపోయారు .


 మంత్రి వర్గం లో స్థానం దక్కకపోవడం తో పార్టీ అధినేత కు తెలిసేవిధంగా రోజా తన  అసంతృప్తి ని వ్యక్తం చేశారు . జగన్ ఈమెను పిలిపించుకుని మాట్లాడారు . ఇక చెవిరెడ్డి కి విప్ పదవి కట్టబెట్టారు . అంబటి రాంబాబు కు మాత్రం ఇంకా ఏ పదవి దక్కలేదు . అయినా వీరంతా మూగనోము పాటించడం పార్టీ వ్యూహం లో భాగమా ? లేకపోతే మంత్రి వర్గం లో స్థానం దక్కలేదన్న అసంతృప్తా అన్నది అంతు చిక్కడం లేదు .


మరింత సమాచారం తెలుసుకోండి: