గోదావరి జలాలను కృష్ణా పరీవాహకానికి తరలించేందుకు అనువైన మార్గాల అన్వేషణలో భాగంగా నీటిపారుదలశాఖ నియమించిన ఇంజినీర్ల కమిటీ కసరత్తు ప్రారంభించింది. గోదావరి-శ్రీశైలం అనుసంధానంపై ఇప్పటివరకూ ఉన్న ప్రతిపాదనలకు తోడు మరిన్ని అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు ఇంజినీర్లు కసరత్తు చేపట్టారు.

 

గూగుల్‌ చిత్రపటాలు, ట్రోపో పటాల ఆధారంగా గోదావరి నుంచి శ్రీశైలానికి 4 టీఎంసీలను తరలించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలు, మార్గాలపై ఇంజినీర్లు చర్చించారు. మంగళవారం జలసౌధలో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ నేతృత్వంలో అంతర్‌రాష్ట్ర జలవ్యవహారాల సీఈ నర్సింహారావు, విశ్రాంత ఇంజినీర్ల సంఘాధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి, సభ్యులు రామారావు తదితరులతో కూడిన కమిటీ సమావేశమైంది.

 

గోదావరి నుంచి శ్రీశైలానికి నీటిని తరలించేందుకు ఇప్పటి వరకు తెరపైకి వచ్చిన ప్రతిపాదనలకు తోడు కొత్తగా రాంపూర్‌ ప్రాంతాన్ని పరిశీలనలోకి తీసుకున్నారు. కంతనపల్లి నుంచి శ్రీశైలం జలాశయానికి గోదావరి జలాల ఎత్తిపోసేందుకు అనువైన మార్గాలపై ఇప్పటి వరకు అన్వేషణ చేపట్టిన ఇంజినీర్లు కంతనపల్లి కన్నా మెరుగైన ప్రాంతం, ఎత్తిపోతకు ఉన్న వెసులుబాటును పరిగణనలోకి తీసుకుని రాంపూర్‌ను కూడా ఒక తావుగా గుర్తించారు.

 

నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి-కృష్ణాలను కలిపేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం రాంపూర్‌నకు దిగువన ఉన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లా మంగపేట మండలం అకినేపల్లి నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్‌కు ఎత్తిపోయాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం కంతనపల్లి, రాంపూర్‌, అకినేపల్లి ప్రాంతాలను ఇంజినీర్లు పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. దుమ్ముగూడెం నుంచి కూడా నీటి తరలింపునకు ఉన్న అవకాశాలను చర్చించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: