చంద్రబాబునాయుడు హయాంలో అసెంబ్లీ సమావేశాలు తీరుకు  ప్రస్తుత సమావేశాలకు జనాలకు తేడా తెలియాలంటే సభలో ప్రతిపక్షం ఉండాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. మనం తల్చుకుంటే అసెంబ్లీలో టిడిపికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దూరమైపోతుందన్నారు. టిడిపికి చెందిన కొందరు ఎంఎల్ఏలను లాగేసుకుందామని తనపై ఒత్తిడి తెచ్చినా తాను ఒప్పుకోలేదన్నారు.

 

సభలో ప్రతిపక్షం ఉండాల్సిందే చంద్రబాబు అండ్ కో మాట్లాడుతున్న అబద్దాలను జనాలందరూ వినాల్సిందే అంటూ చంద్రబాబు తీరునే జగన్ ఎండగట్టారు. ఎంఎల్ఏలు, ఎంఎల్సీలకు రెండు రోజుల  అవగాహన తరగతులు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో జగన్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో గతంలో చంద్రబాబు మాట్లాడిన అబద్దాలపై జగన్ సెటైర్లు విసిరారు.

 

మన ప్రభుత్వానికి  అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ధైర్యంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కొందామన్నారు. ఇందులో భాగంగానే సమస్యలు లేవనెత్తేందుకు, విమర్శలు చేయటానికి ప్రతిపక్షానికి పూర్తి స్వేచ్చ ఇవ్వాలని జగన్ అభిప్రాయపడ్డారు. సభకు వచ్చే సభ్యులందరూ మాట్లాడేందుకు పూర్తి సన్నద్దదతో రావాలని స్పష్టం చేశారు.

 

సభలో మాట్లాడే సభ్యులందరికి  నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఎంఎల్ఏలందరినీ సభకు హాజరయ్యేలా చూసేందుకు ప్రతీ 15 మంది ఎంఎల్ఏలకు ఓ స్ట్రాటజిక్ లీడర్ ను నియమించనున్నట్లు చెప్పారు.  మొత్తం మీద ఎంఎల్ఏలకు జగన్ క్లాసులు తీసుకుంటునే, ప్రతిపక్షానికి సవాలు విసురుతునే అందరికీ తమ బాధ్యతను గుర్తు చేయటం గమనార్హం.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: