ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆకస్మిక తనిఖీలకు సిద్ధమవుతున్నారు. పాలనపై ప్రజాభిప్రాయాన్ని నేరుగా తెలుసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. అక్టోబరు చివర లేక సెప్టెంబరు మొదటివారంలో రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టాలన్న యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. పాలనలో తండ్రి అడుగుజాడలలో నడుస్తున్న జగన్‌, రచ్చబండ విషయంలోనూ అదే ధోరణిలో వెళ్లాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.

 

2009 సెప్టెంబరు 2వ తేదీన రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టేందుకు నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాకు వెళుతూ పావురాలగుట్ట వద్ద జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. తన తండ్రి మరణించిన సెప్టెంబరు రెండో తేదీనే రచ్చబండకు ముఖ్యమంత్రి జగన్‌ శ్రీకారం చుడతారని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.

 

ఈ కార్యక్రమాన్ని ఆకస్మికంగా చేపట్టాలని సీఎం నిర్ణయించారని చెబుతున్నారు. ముందస్తుగా ఎక్కడకు వెళ్తున్నది చెబితే .. పార్టీ నేతల తాకిడి పెరగడం .. భారీ బందోబస్తు ఏర్పాటు వల్ల హంగామా ఉంటుందే తప్ప, ప్రజల నుంచి పాలనపై వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఉండదని ముఖ్యమంత్రి భావిస్తున్నారని పార్టీ నేతలు వివరిస్తున్నారు. రాష్ట్రంలో గ్రామ సచివాలయాల వ్యవస్థను అక్టోబరు రెండో తేదీ నాటికి పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుతారు.

 

ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం నుంచి నేరుగా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా స్పందన పేరిట వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అయితే.. ప్రజలు వినతులు ఇచ్చేందుకు వీలుగా సదుపాయాల కల్పనతో పాటు .. మంచినీటి సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాకపోవడంతో .. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అయితే, జిల్లాల్లో మాత్రం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సోమవారమే ప్రజా స్పందన కార్యక్రమాన్ని చేపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: