అన్ని చట్టబద్ధమైన అనుమతులతో అప్పగించాల్సిన నిర్మాణదారు దానికి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడంలోనే లోపాలున్నాయని, అంతేగాక వాణిజ్య నిర్మాణం చేసి అమాయకులకు కట్టబెట్టడం విశ్వాసఘాతుకమని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తప్పుబట్టింది. కనీస పరిజ్ఞానం లేకుండా కొనుగోలు చేయడం తప్పే అయినప్పటికీ ఈ కారణంగా నిర్మాణదారు బాధ్యత నుంచి తప్పించుకోజాలరంది.

 

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం నిజాంపేటలో ‘లేక్‌ రిడ్జ్‌’ అపార్టుమెంట్‌ సెల్లార్‌లో అక్రమంగా నిర్మించిన షట్టర్లు కొనుగోలు చేసి నష్టపోయిన ఎం.రాణి అనే మహిళ చెల్లించిన సొమ్ము రూ.9.90 లక్షలు, పరిహారంగా రూ.50 వేలు, ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలంటూ సాయికృప బిల్డర్స్‌, గొట్టిపాటి వెంకటేశ్వరరావు, అట్టలూరి శ్రీనివాసరావులను ఆదేశించింది.

 

లేక్‌రిడ్జ్‌లో అపార్టుమెంట్‌లో 550 చదరపు అడుగుల షట్టర్‌ను 2015 జులైలో 9.90 లక్షలకు రాణి కొనుగోలు చేశారు. ఈ షట్టర్‌ను ‘ఆహారం’ అనే సంస్థకు నెలకు రూ.13,500 చొప్పున అయిదేళ్లకు అద్దెకివ్వడంతో పాటు రూ.81 వేలను అడ్వాన్స్‌గా తీసుకున్నారు. పదవీ విరమణ చేసిన రాణి దంపతులకు ఇదే జీవనాధారం. 2015 సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు సెల్లార్‌ మొత్తం నీట మునిగిపోయింది.

 

దీంతో అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ అపార్ట్‌మెంట్‌లోని వారు హెచ్‌ఎండీఏకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం హైకోర్టును ఆశ్రయించారు. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పడంతో తాను అక్రమ నిర్మాణాన్ని కొనుగోలు చేసి నష్టపోయినట్లు తెలుసుకున్నారు. తాను చెల్లించిన సొమ్మును వాపసు ఇవ్వాలని కోరినా నిర్మాణదారు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి రూ.31.96 లక్షలు 18 శాతం వడ్డీతో చెల్లించేలా ఆదేశించాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: