హిందూపురం వైసీపీలో ఒకరిద్దరు కట్టప్ప పాత్రలు పోషించడం వల్లే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైందని ఆ పార్టీ నాయకుడు మహ్మద్‌ ఇక్భాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా హిందూపురానికి తానే ఇన్‌చార్జ్‌ అని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం డీఆర్‌ కాలనీలోని స్వగృహంలో మహ్మద్‌ ఇక్బాల్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తన వేరుశనగ కోసం రైతులు పడుతున్న ఇబ్బందులకు కారణం గత ప్రభుత్వం తప్పిదాల వల్లే అన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా రైతులకు సరిపడా విత్తనాన్ని అందుబాటులో ఉంచకపోవడం వల్లే జిల్లాలో వేరుశనగ విత్తనం కోసం రైతులు ఇబ్బందులుపడుతున్నారన్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వంపై నిందలు వేయడం తగదన్నారు.

 

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రైతులపట్ల అభిమానం ఉంటే గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి ఇబ్బందిలేకుండా చూసి ఉంటే ఈ రోజూ ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంకు సంబంధించి విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోవడం, దానిపై నిరంతరం పర్యవేక్షణ లేకపోవడం వల్లే నీటి సమస్య తలెత్తిందన్నారు.

 

అయితే గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకొస్తున్నారు కానీ భవిష్యత్తులో కియా పరిశ్రమకే అక్కడి నీరు సరిపోతాయన్నారు. గత ప్రభుత్వం రైతులను విస్మరించి ఉన్న డబ్బును పసుపు కుంకుమగా అందజేశారు. దీంతో ప్రస్తుత సమస్యకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతులపట్ల చిత్తశుద్దితో పనిచేస్తున్నారని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: