అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రంగనాథ్ పాండే రాసిన లేఖ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన రాసిన లేఖలోని అంశాలే దీనికి కారణంగా చెప్పాలి. హైకోర్టు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో కులం.. బంధుప్రీతి ప్రధాన అర్హతగా మారిందన్న బాంబు పేల్చారు. భారత్ లో న్యాయవ్యవస్థ బంధుప్రీతి.. కులతత్వంతో పెనవేసుకుపోవటం దురదృష్టకరంగా ఆయన అభివర్ణించారు.

 

న్యాయమూర్తుల కుటుంబ సభ్యులకు చెందిన వారు కచ్ఛితంగా తదుపరి న్యాయమూర్తి కావటం ఖాయంగా మారిందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. హైకోర్టు.. సుప్రీంకోర్టుల న్యాయమూర్తలు నియామకానికి సంబంధించి పారదర్శకతతో కూడిన యంత్రాంగం లేదన్నారు. ఏ న్యాయమూర్తికి ప్రమోషన్ వచ్చిందో.. అందుకు అవసరమైన ప్రాతిపదిక ఏమిటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు.

 

ఏసీ గదుల్లో టీ తాగుతూ సీనియర్ న్యాయమూర్తులు హైకోర్టు.. సుప్రీంకోర్టు జడ్జిల నియామకం చేపడుతున్నారని ఆరోపించారు. అత్యంత రహస్యంగా సాగుతున్న ఈ తంతు ముగుస్తున్న తర్వాతేనే కొత్త న్యాయమూర్తుల పేర్లు బయటకు వస్తున్నాయన్నారు.  ఈ నేపథ్యంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటు చేస్తే న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో పారదర్శకత వస్తుందన్నారు. అయితే.. స్వతంత్ర ప్రతిపత్తి పేరుతో సీనియర్ న్యాయమూర్తులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని తప్పు పట్టారు.

 

పెను సంచలనంగా మారిన ఈ లేఖ ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసిందని చెప్పాలి. న్యాయవ్యవస్థకున్నస్వతంత్ర ప్రతిపత్తితోనే హైకోర్టు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం నడుస్తోంది. అయితే.. ఈ తీరుకు చెక్ పెట్టాలని మోడీ సర్కారు ఎప్పటి నుంచో భావిస్తోంది.  వాస్తవానికి మోడీ సర్కారు ప్రస్తుతం అమలవుతున్న తీరును తప్పు పడుతూ.. దానికి సంస్కరణలు చేపట్టాలని భావిస్తున్నారు. దీనికి న్యాయవ్యవస్థకు చెందిన ప్రముఖులు అస్సలు ఒప్పుకోవటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: